ప్రేరణ: నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా నీ పెదాల మీద కొంత నవ్వు లేకపోతే అవన్నీ వృధానే, అందుకే నవ్వండి
ఈ వార్తాకథనం ఏంటి
ఉరుకులు పరుగుల ప్రయాణంలో, కార్పోరేట్ ఉద్యోగాలతో జీవితాలను వెల్లదీస్తున్న వారందరూ తమ ముఖం మీద ఎప్పుడూ చిరాకును అంటించుకుని తిరుగుతారు. ఎందుకని అడిగితే ఇంకా చిరాకు పడతారు.
కారణం ఏదైతేనేం మనుషులు నవ్వడం మర్చిపోతున్నారు. ప్రశాంతంగా, హ్యాపీగా, అంతులేని ఆనందంతో నవ్వడం ఎప్పుడో మర్చిపోయారు.
సెల్ఫీ కోసం తప్ప హ్యాపీగా నవ్వడం తగ్గిపోయింది. నవ్వు తగ్గిపోయిందంటే జీవితంలో కష్టాలు పెరిగాయన్నమాట.
కొందరికి కష్టాలు లేకపోయినా నవ్వడానికి తీరిక ఉండదు. వాళ్ళు చాలా పనుల్లో బిజీగా ఉంటారు. పిల్లల్ని కనడము, వాళ్ళని పెంచడం కూడా టైమ్ వేస్ట్ అన్నంత బిజీగా గడిపేస్తున్న వారు రోజురోజుకూ పెరుగుతున్నారు.
ఎవరిష్టాలు వాళ్ళవి, ఎవరి జీవితాలు వాళ్ళవి. అయితే నవ్వును నిర్లక్ష్యం చేస్తే జీవితాన్ని నిర్లక్ష్యం చేసినట్టు అవుతుంది.
Details
చిన్న చిరునవ్వు చేసే మేలు
పొద్దున్న లేవగానే ఈరోజు ఎంత హ్యాపీగా ఉండబోతుందో అన్న ఆలోచనతో వచ్చిన నవ్వు, రోజంతా ప్రశాంతంగా ఉంచుతుంది.
రాత్రవగానే ఈరోజు చాలా హ్యాపీగా గడిచిపోయిందన్న ఆలోచనతో వచ్చిన నవ్వు, రేపటికి ఎనర్జీని ఇస్తుంది.
తోటివారిని పలకరించేటపుడు వచ్చే చిన్న చిరునవ్వు, అవతలి వారితో మీ బంధాన్ని బలోపేతం చేస్తుంది.
కష్టాల్లో ఉన్నప్పుడు ఇంతచిన్న కష్టం నన్నేం చేయగలదన్న నమ్మకంతో వచ్చే నవ్వు, కష్టాలను దాటే మార్గాలను అన్వేషించే ఆలోచనను రేకెత్తిస్తుంది.
అందుకే నవ్వండి. సెల్ఫీ కోసం నవ్వితే ఫోటో అందంగా కనిపిస్తుంది. మీకోసం నవ్వితే మీ జీవితం అందంగా తయారవుతుంది.