ప్రేరణ: ఇతరులకు సహాయం చెయ్యడమే అసలైన విజయం
ఇవ్వడానికి చాలా పెద్ద మనసుండాలి. అది ప్రేమైనా, ఒక వస్తువైనా లేదా డబ్బులైనా సరే, మన దగ్గరున్న ఒక వస్తువును అవతలి వాళ్ళకు ఇవ్వడం అంత తేలిక కాదు. ఇస్తే అయిపోతదనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కనీసం నువ్వలా ఉండకు, ఎందుకంటే నువ్వు విజయం వైపు వస్తున్న దారిలో, చాలామంది నీకు ఏదో ఒకటి ఇచ్చే ఉంటారు. వాళ్ళు నీకది ఇవ్వడం వల్లే ఈరోజు నువ్విలా ఉన్నావ్, సరిగ్గా గుర్తు తెచ్చుకో.. నీకు నిజంగా ఎవ్వరూ ఏమీ ఇవ్వలేదా? ఒక మనిషి ఎంతో ఎత్తుకు ఎదిగాడంటే అది అతడొక్కడి కృషి మాత్రమే కాదు. ఉదాహరణకు ఒకరు స్టార్ హీరోగా మారారంటే, అది అభిమానులు ఇచ్చిన ప్రేమ వల్లే.
బాధలను తీర్చే శక్తి కేవలం డబ్బుకే ఉందనుకోవడం పొరపాటు
ఒక్కసారి వాళ్ళు తమ ప్రేమను ఇచ్చేయడం ఆపేస్తే స్టార్ హీరో కాస్తా నేలమీదకు దిగి వచ్చేస్తాడు. నువ్వు స్టార్ గా ఉండాలంటే ఇస్తూనే ఉండు. అభిమానుల నుండి నీకు ప్రేమ వస్తూనే ఉంటుంది. ఇక్కడ ఉద్దేశ్యం లేనపుడు కూడా ఇవ్వమని కాదు, అండ్ కేవలం డబ్బులివ్వమనీ కాదు. మనుషులు బాధల్లో ఉన్నప్పుడు ప్రతీసారీ డబ్బొక్కటే బాధలను తీర్చదు. అవతలి వారు బాధలో ఉన్నప్పుడు కనీసం ఒక పలకరింపు, వీలైతే చిన్న ఓదార్పు, కావాల్సివస్తే కాస్త ప్రేమ చాలు. తన చుట్టూ ఎవరూ లేక చీకటి కమ్ముకున్నప్పుడు, చీకటిలోంచి బయటకు తెచ్చేవాళ్లే అవసరం లేదు, చీకట్లో ఏం చేస్తున్నావ్ అని పలకరించండి. ఆ పిలుపు వైపు వెళ్తే వెలుగు వస్తుందని అవతలి వాళ్ళకు అర్థమైపోతుంది.