ప్రేరణ: నువ్వు తీసుకున్న నిర్ణయాలకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకోకపోతే నీకెక్కడా రెస్పెక్ట్ దొరకదు
ఈ ప్రపంచంలో ఏ మనిషీ పర్ఫెక్ట్ కాదు. ఈ విషయం నీకు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉండాలి. ముఖ్యంగా తాము తప్పు చేసారో లేదో తెలుసుకోకుండానే తప్పయ్యిందని తెగ ఫీలైపోయేవాళ్ళు. మనుషులు తప్పులు చేస్తారు. అది సహజం. చాలా సార్లు మనం తీసుకున్న నిర్ణయాల వల్ల తప్పులు జరుగుతుంటాయి. ఒక్కోసారి ఒక నిర్ణయం, మీ జీవితాన్నే పూర్తిగా మార్చేయవచ్చు. అయినా కూడా ఆ నిర్ణయం గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. ఎందుకంటే జరిగిన దాన్ని నువ్వెలాగూ మార్చలేవు. నిర్ణయం తీసుకోవడంలో తప్పు చేసావని గుర్తించి, మళ్ళీ అలాంటి తప్పుచేయకుండా జాగ్రత్త పడాలి. అంతేకానీ ఫీలైపోయి మిమ్మల్ని మీరు తిట్టేసుకుంటూ మీకు నిర్ణయం తీసుకోవడం రాదని బాధపడితే అంతే సంగతులు.
అవతలి వాళ్ల పాటకు మీరు స్టెప్పులు వేయకండి
మీకు నిర్ణయం తీసుకోవడం రావట్లేదని మీకు మీరే సర్టిఫికేట్ ఇచ్చేసుకున్నారనుకోండి, ఈ సమాజంలో మీకంటూ ఒక సర్టిఫికేట్ లేకుండా చేస్తారు. మీ జీవితాన్ని మీరు బ్రతకలేకుండా ఐపోతుంది. అవతలి వాళ్ళ పాటకు మీరు డ్యాన్స్ వేసినట్లుగా అవుతుంది. దానివల్ల మీ కాళ్ళు సరిగ్గా కదలవు. వెనకబడిపోతారు. చివరికి ఓడిపోతారు. అందుకే అవతలి వారి ఆధరపడవద్దు. తప్పో, ఒప్పో మీ నిర్ణయాలు మీరు తీసుకోండి. వాటికి కట్టుబడి ఉండండి. నష్టమొచ్చినా, లాభమొచ్చినా భరించండి. అలా అని చెప్పి ఎదుటి వాళ్ళ సలహాలు పూర్తిగా వినవద్దని కాదు, సలాహాలు వినాలి. డెసిషన్ మాత్రం మీరు తీసుకోవాలి. ఒకసారి డెసిషన్ తీసుకున్నాక దాని ఫలితం ఎలా ఉన్నా బాధపడకూడదు.