
Motivation: ప్రయత్నం ఆపకూడదు.. ప్రయత్నమే విజయానికి దారి
ఈ వార్తాకథనం ఏంటి
పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతడు ఎంతో తెలివైనవాడు. తన రాజ్యాన్ని రక్షించేందుకు ప్రతి సంవత్సరం అత్యుత్తమమైన సైనికులను ఎన్నుకునేవాడు. ఈ ఎంపికలో అతడు ఎప్పుడూ పొరపాటు చేయలేదు.సైనికుల ఎంపిక విషయంలో అతడి తెలివితేటలు అందరికీ తెలిసినవే. ప్రతి సంవత్సరం జరిగే ఎంపికలో కొత్తకొత్త పరీక్షలు ఉండేవి. అందుకే యువకులు ఆ పరీక్షల కోసం ఆతృతగా ఎదురుచూసేవారు. ఇలా ఒకసారి యువకుల ఎంపిక కాలం వచ్చేసింది. రాజు తన సైన్యంలో కొత్తగా యువకులను తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రతి గ్రామంలో పోటీలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ పోటీల్లో గెలిచినవారికి శిక్షణ ఇచ్చి, మంచి జీతభత్యాలు ఇచ్చి, వారిని సైన్యంలో నియమిస్తామని ప్రకటించారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని అనుకున్న యువకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
వివరాలు
తమ వొంతు ప్రయత్నం..
రాజు పరీక్షలు నిర్వహిస్తూ గ్రామాలన్నీ తిరుగుతూ.. రామాపురం అనే ఊరికి వచ్చాడు. అక్కడి మైదానంలో పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాజు ఆజ్ఞతో కొందరు యువకులు ఒక భారీ రాయిని మైదానం మధ్యకు తీసుకొచ్చారు. అప్పుడు రాజు యువకుల్ని ఉద్దేశించి,"ఈ రాయిని ఎత్తగలిగినవారిని సైన్యంలో ఉద్యోగం కోసం ఎంపిక చేస్తాం" అని ప్రకటించాడు. దాదాపు 50 మంది యువకులు అక్కడికి వచ్చారు. అయితే వారిలో 40 మంది ఈ రాయి చాలా బరువైనదని భావించి, ప్రయత్నించకుండానే వెనక్కి వెళ్లిపోయారు. మిగతా పదిమంది మాత్రం ముందుకు వచ్చి రాయిని ఎత్తేందుకు శక్తిమేరకు ప్రయత్నించారు. వారంతా విఫలమయ్యారు, అయినా ప్రయత్నం మాత్రం చేశారు. చుట్టూ ఉన్నవారు నవ్వినా వారు మాత్రం అదేమీ పట్టించుకోకుండా తమ వొంతు ప్రయత్నం చేశారు.
వివరాలు
ఓటమి భయాన్ని జయించి ముందుకు..
పరీక్ష ముగిసిన తరువాత, రాజు ఆశ్చర్యంగా ఆ రాయిని ఎత్తడానికి ప్రయత్నించిన 10 మందిని సైనిక శిక్షణ కోసం ఎంపిక చేసినట్టు ప్రకటించాడు. దీంతో ప్రయత్నం కూడా చేయని ఆ 40 మంది యువకులు రాజుని ప్రశ్నించారు. "రాయిని ఎత్తినవారికి మాత్రమే ఉద్యోగం అన్నారుగా, మరి వీరు ఎత్తలేకపోయారు కదా? వారిని ఎలా చేర్చుకుంటారు?' అని అడిగారు. అప్పుడు రాజు "రాయిని ఎత్తలేరని నాకు ముందే తెలుసు. కానీ వీరు తమ శక్తిమేరకు ప్రయత్నించారు. ఓటమి భయాన్ని జయించి ముందుకు వచ్చారు. మీరు మాత్రం ప్రయత్నించకుండానే మానేశారు. నన్ను, నా రాజ్యాన్ని కాపాడాల్సినవారు ఓటమిని భయపడకుండా ముందుకు వెళ్లేవారే కావాలి. అందుకే వీరిని ఎంపిక చేశాను" అని చెప్పాడు.
వివరాలు
ప్రయత్నం విజయానికి తొలి మెట్టు
ప్రయత్నం చేయకుండా మానేస్తే మనం ముందుకు పోవడం అసాధ్యం. కొన్నిసార్లు చిన్న ప్రయత్నమే మన జీవితంలో పెద్ద మార్పును తీసుకువచ్చే అవకాశం అవుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్లు.."ప్రయత్నించి ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించకముందే ఓడిపోవడాన్ని ఒప్పుకోరాదు." ఒక్కసారిగా కొట్టిన సుత్తి రాయిని పగలగొట్టదు. కానీ దెబ్బపై దెబ్బ కొడుతుంటే ఓ సమయంలో అది విరుగుతుంది. అలాగే మనం కూడా పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, నిరంతరం శ్రమిస్తూ, నమ్మకంగా ముందుకు సాగాలి. విజయానికి ప్రయత్నమే మొదటి మెట్టు. ప్రయత్నం వృథా కాదు. కష్టపడి ముందుకు సాగిన వారిని అదృష్టం ఎప్పుడో ఒకరోజు తటస్థించి నిలబెడుతుంది.