ప్రేరణ: ఈ ప్రపంచంలో దేనికైనా ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది, నీ కష్టానికి కూడా
ఎక్స్ పైరీ.. ఈ మాట ఎవ్వరికీ నచ్చదు. ఎందుకంటే గడుస్తున్న జీవితం సడెన్ గా ఆగిపోతుందంటే ఎవ్వరికైనా ఎందుకు నచ్చుతుంది. అయితే ఇక్కడ ఎక్స్ పైరీని పాజిటివ్ గా చూద్దాం. మనిషి జీవితానికి ఎక్స్ పైరీ ఎలా ఉంటుందో, జీవితంలో వచ్చే కష్టాలకూ ఎక్స్ పైరీ ఉంటుంది. ఏదో ఒక రోజు నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్న నీ నుండి దూరంగా జరిగి మాయమైపోతుంది. అయితే ఆ ఎక్స్ పైరీ ఎప్పుడు ఉంటుందనేది ఎవ్వరికీ తెలియదు. కానీ ఒక్క విషయం చెప్పగలం. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునే మనిషి జీవితకాలం పెరిగినట్టు, సరిగ్గా పనిచేసుకుంటూ వెళ్తే కష్టాలు తొందరగా ఎక్స్ పైరీకి వచ్చేస్తాయి.
కష్టాన్ని చూసి పారిపోతే ఆ కష్టం ఇంకా పెరుగుతుంది
జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా కుంగిపోకూడదు. ఏదో ఒకరోజు అది నీ నుండి దూరంగా పోతుందని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మరో విషయం ఏంటంటే, కష్టం తర్వాత వచ్చేది సుఖమే కాబట్టి కష్టం వచ్చినపుడు దాన్ని తొందరగా దూరం చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతేకానీ కష్టాన్ని చూసి పారిపోకండి. అలా మీరు పారిపోతున్న కొద్దీ మీ కష్టం ఇంకా పెరుగుతూ మీ దగ్గరకు వస్తుంది. ఉదాహరణకు మీరు ఒకరికి లక్ష రూపాయలు అప్పు కట్టాలి. మొదటి సంవత్సరం కట్టలేదు, రెండో సంవత్సరానికి వడ్డీతో కలిపి 1,24,000 రూపాయలు అయ్యింది. కష్టాలకు ఎదురొడ్డి నిలబడక పోతే వడ్డీ పెరిగినట్లు పెరుగుతూనే ఉంటుందని గుర్తుంచుకోండి. ముందే చెప్పినట్లు ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని తెలుసుకోండి.