ఆరోగ్యం: చిగుళ్ళ వ్యాధులను దూరంగా ఉంచడానికి కావాల్సిన టిప్స్
నోటి ఆరోగ్యం గురించి ఎక్కువగా పట్టించుకోరు. మరీ ముఖ్యంగా పంటి ఆరోగ్యాన్ని అసలు లెక్కలోకి తీసుకోని వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మీకిది తెలుసా? పళ్ళు ఆరోగ్యంగా లేకపోతే మీరు అందంగా నవ్వలేరు . మీ నవ్వు అందంగా ఉంటేనే పదిమంది మీతో ఉండగలరు. మరలాంటప్పుడు పంటికి సంబంధించిన అనారోగ్యాల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. పంటి చిగుళ్ళు, అనారోగ్యానికి గురికాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. రెండు సార్లు బ్రష్ చేయాలి: పొద్దున్న, రాత్రి బ్రష్ చేయడం అలవాటు చేసుకోండి. మృదువైన పళ్ళున్న బ్రష్, ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ వాడాలి. బ్రష్ చేశాక నాలుకను శుభ్రపర్చుకోవాలి. సాధారణంగా నాలుక మీద సూక్ష్మక్రిములు ఎక్కువగా ఉంటాయి.
పంటి చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి చేయాల్సిన పనులు
మౌత్ వాష్: నోట్లోని బాక్టీరియాను చంపి తాజాశ్వాసను అందించే మౌత్ వాష్ తప్పనిసరిగా వాడండి. అలాగే తిన్న ప్రతీసారీ నోట్లో నీళ్ళు పోసుకుని పుక్కిలించి ఉమ్మివేయడం మంచిది. పొగ తాగకూడదు: సిగరెట్ తాగేవారికి చిగుళ్ల వ్యాధులు తొందరగా వస్తాయి. పొగతాగడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దానివల్ల చిగుళ్ళకు వచ్చిన వ్యాధులు అంత తొందరగా నయం కావు. డైట్: పోషకాలున్న ఆహారాలైన పండ్లు, కూరగాయలను మీ డైట్ లో చేర్చుకోండి. చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. చక్కెర, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలను పక్కన పెట్టండి. దానివల్ల చిగుళ్ళ సందుల్లో పాచి పెరుగుతుంది. చిగుళ్ళలో నిలిచిపోయిన పాచిని తొలగించాలంటే, నీళ్ళలో కొద్దిగా వెనిగర్ ని కలిపి పుక్కిలించి ఉమ్మివేయాలి.