రాఖీ పండగ: ముహూర్తం, తెలుసుకోవాల్సిన విషయాలు, రాఖీ కట్టడానికి సరైన సమయాలు
ప్రతీ ఏడాది శ్రావణమాసంలో పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు. అక్కా చెల్లెల్లు అన్నదమ్ములకు రాఖీ కట్టి తమకు ఎప్పుడు రక్షణగా ఉండాలని కోరుకుంటారు. అలాగే రాఖీ కట్టినందుకుగాను అక్కాచెల్లెళ్లకు బహుమతులు అందించి ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని అన్నాతమ్ముళ్ళు తెలియజేస్తుంటారు. ఈ ఏడాది రాఖీ పండగ ఎప్పుడు జరుపుకోవాలనే విషయంలో చాలామందికి సందేహాలు ఉన్నాయి. కొంతమంది ఆగస్టు 30వ తేదీన జరుపుకోవాలని అంటున్నారు. మరికొందరు 31వ తేదీన జరుపుకోవాలని చెబుతున్నారు. నిజానికి రాఖీ పండుగను పౌర్ణమి తిథి రోజున జరుపుకోవాలి. శ్రావణమాస శుక్లపక్షంలో పౌర్ణమి తిథి ఆగస్టు 30వ తేదీన ఉదయం 10:58గంటలకు మొదలవుతుంది. మరుసటి రోజు ఉదయం 7:05గంటలకు పూర్తవుతుంది.
ఏ సమయంలో రాఖీ కట్టాలి?
పౌర్ణమి తిథి 30వ తేదీన ఉంటుంది కాబట్టి ఆ రోజు రాఖీ పండగ జరుపుకోవచ్చని కొంతమంది సూచిస్తున్నారు. కాకపోతే ఈ రోజున భద్ర కాలం వచ్చింది. కాబట్టి రాఖీ కట్టడానికి సరైన ముహూర్తం చూసుకోవాల్సి ఉంది. భద్రకాలం అనేది ఆగస్టు 30న 10:58 నిమిషాలకు ప్రారంభమై రాత్రి 9:01 వరకు ఉంటుంది. ఈ సమయంలో రాఖీ కట్టకూడదని పండితులు తెలియజేస్తున్నారు. ఒకవేళ రాఖీ కట్టాలనుకుంటే ఆగస్టు 30న రాత్రి 9:01గంటల తర్వాతే కట్టాలని చెబుతున్నారు. అలాగే ఆగస్టు 31వ తేదీన రాఖీ పండుగ జరుపుకునే వారు ఉదయం 7:05గంటల లోపే రాఖీ కట్టాలని అంటున్నారు.
భద్ర కాలంలో రాఖీ ఎందుకు కట్టకూడదు
ఈ భూమి మీద రాక్షసులను అంతం చేయడానికి సూర్యదేవుని పుత్రిక భద్ర జన్మించింది. ఆమె పుట్టినప్పుడు భూమి మీద శుభకార్యాలు చేయకూడదని చెబుతారు. ఒకవేళ చేస్తే ఇబ్బందులు కలుగుతాయని పురాణాల్లో ఉంది. అందుకే భద్రకాలంలో రాఖీ కట్టకూడదని పండితులు చెబుతున్నారు.