Gandhi Jayanti 2024 : మహాత్మా గాంధీ కలల స్వరాజ్యానికి ప్రతీక 'సబర్మతి ఆశ్రమం'
ప్రతీ ఏటా అక్టోబర్ 2న గాంధీ జయంతిని దేశమంతా ఘనంగా జరుపుకుంటాం. మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీగా పుట్టిన ఆయన కాలక్రమంలో మహాత్మా గాంధీగా, దేశానికి జాతిపితగా ఎదిగాడు. సత్యాగ్రహం, అహింస సిద్ధాంతాలతో ప్రపంచాన్ని మార్గనిర్దేశం చేసిన గాంధీజీ, తమ పోరాటాన్ని దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ప్రారంభించారు. 1893లో 24 ఏళ్ల వయస్సులో అక్కడ అడుగుపెట్టిన గాంధీ, అక్కడ 21 ఏళ్లు గడిపారు. దక్షిణాఫ్రికా నుంచి 1914లో భారత్‌కు తిరిగి వచ్చారు. దక్షిణాఫ్రికాలో గాంధీ జీవించిన చోట్లలో ముఖ్యమైనది డర్బన్‌లోని ఫీనిక్స్ సెటిల్మెంట్. 1903లో గాంధీజీ అక్కడ ఆశ్రమం స్థాపించారు.
సమానత్వం కోసం పోరాడిన గాంధీజీ
ఈ సెటిల్మెంట్‌లో గాంధీ తన జీవిత విధానంలో మార్పులు చేసుకున్నారు. ఈ మార్పుల వల్లనే ఆయన నల్ల జాతీయులతో కలిసి పనిచేసి, సమానత్వం కోసం పోరాడారు. అయితే ఈ మార్పు చెందే ముందు గాంధీ ఆంగ్లేయుల తరహాలో ఉండేవారని, కొందరు ఆయన్ని మొదట్లో జాత్యహంకారి అన్నారని చరిత్రకారులు గుర్తుచేస్తారు. 1915లో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన గాంధీజీ, మొదట కొచరబ్‌లో ఆశ్రమాన్ని స్థాపించారు.
గాంధీ ఆశ్రమం - అబ్దుల్ ఖాదిర్ బావజీర్ పాత్ర
సబర్మతి నది తీరంలోని 36 ఎకరాల విస్తీర్ణంలో 1917లో ఆశ్రమాన్ని మార్చి, అదే సబర్మతి ఆశ్రమంగా ప్రసిద్ధి చెందింది. వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ ఆశ్రమం, స్వాతంత్ర పోరాటంలో గాంధీకి స్ఫూర్తినిచ్చింది. ప్రతి మనిషి అవసరానికి ఈ ప్రపంచం సరిపోతుందని, కానీ దురాశకు మాత్రం కాదని ఆయన ఈ ఆశ్రమంలో చెప్పారు. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు గాంధీకి పరిచయమైన అబ్దుల్ ఖాదిర్ బావజీర్, అతనికి అత్యంత సన్నిహితుడయ్యాడు. ఆయనే తర్వాత గాంధీ ఆశ్రమం బాధ్యతలను చేపట్టి, దీన్ని ముందుకు తీసుకెళ్లారు.