
Sapien Labs: హైదరాబాదీయుల మానసిక ఆరోగ్య పరిస్థితి శోచనీయం.. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో దారుణ స్థితి..!
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగర మానసిక ఆరోగ్య పరిస్థితి ఏమైపోయింది? ప్రత్యేకించి యువతలో ఈ స్థాయి ఆందోళనకర స్థితి ఎందుకు నెలకొంది? ఇది అపోహ కాదు.
ఇది అంతర్జాతీయ స్థాయి పరిశోధన సంస్థ అయిన సేపియన్ ల్యాబ్స్ నిర్వహించిన సమగ్ర అధ్యయనంలో వెలుగు చూసిన నిజం.
'మెంటల్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్' పేరుతో విడుదల చేసిన ఈ గ్లోబల్ రిపోర్టు ప్రకారం, హైదరాబాద్ నగరం మానసిక ఆరోగ్య సూచీల పరంగా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో వెనుకబడిందని స్పష్టమైంది.
ముఖ్యంగా 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు గల యువత తీవ్ర మానసిక ఒత్తిడి, అస్పష్టతతో బాధపడుతున్నారని నివేదిక పేర్కొంది.
వివరాలు
హైదరాబాద్ నగరం కేవలం 58.3 పాయింట్లను మాత్రమే సాధించింది
ఈ అధ్యయనం కోసం సేపియన్ ల్యాబ్స్ ప్రపంచవ్యాప్తంగా 75,000 మందికి పైగా వ్యక్తుల నుంచి డేటా సేకరించింది.
మానసిక ఆరోగ్య సూచిక (Mental Health Quotient - MHQ) స్కేల్‌ను ఆధారంగా చేసుకుని ఈ విశ్లేషణను చేశారు.
గ్లోబల్ సగటు MHQ స్కోరు 63గా ఉండగా, హైదరాబాద్ నగరం కేవలం 58.3 పాయింట్లను మాత్రమే సాధించింది.
భారతదేశంలో ఉన్న ఇతర మెట్రో నగరాలతో పోల్చినప్పుడు కూడా హైదరాబాద్ స్థితి మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది.
ఉదాహరణకు, ఢిల్లీ 54.4 స్కోరుతో హైదరాబాద్ తర్వాతి స్థానంలో నిలిచింది.
వివరాలు
మానసిక పనితీరు తగ్గిపోవడం
MHQ స్కేల్ ప్రకారం మానసిక స్థితిని వివిధ స్థాయిలుగా.. తీవ్రమైన ఇబ్బందులు ఉన్న వారు నుంచి, స్థిరంగా ఉన్నవారు, ఉత్తమ స్థితిలో ఉన్నవారు వరకు విభజించారు.
హైదరాబాద్ వాసులు సగటున 'ఎండ్యూరింగ్' (అనుకూలించేందుకు ప్రయత్నించే స్థితి) 'మెనేజింగ్' (ఒత్తిడిని కంట్రోల్‌లో పెట్టుకునే స్థితి) క్యాటగిరీల మధ్యే ఉన్నారని రిపోర్ట్ తెలియజేసింది.
నగర జనాభాలో సుమారు 31 శాతం మంది మానసికంగా "బాధపడుతున్న" లేదా "తీవ్రంగా కష్టపడుతున్న" స్థితిలో ఉన్నట్లు వెల్లడైంది. వీరికి భావోద్వేగ నియంత్రణ లోపించడం, వ్యక్తిగత సంబంధాల్లో బలహీనతలు కనిపించడం, మానసిక పనితీరు తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉన్నట్లు సేపియన్ ల్యాబ్స్ డైరెక్టర్ డాక్టర్ శైలేంద్ర స్వామినాథ్ వివరించారు.
వివరాలు
యువతలో మానసిక ఆరోగ్య సమస్యలు అత్యధికం
ఈ అధ్యయనంలో అత్యంత ఆందోళన కలిగించిన అంశం.. యువతలో మానసిక ఆరోగ్య సమస్యలు అత్యధికంగా ఉండటం.
55 ఏళ్లు పైబడిన వయోజనులు అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి 102.4 MHQ స్కోర్ సాధించారు. ఇది మానసిక స్థితి బాగుందని సూచిస్తుంది.
అయితే 18-24 ఏళ్ల వయస్సు గల యువత మాత్రం బేస్‌లైన్ స్కోర్ కంటే కేవలం 27 పాయింట్లు ఎక్కువగా సాధించి 'ఎండ్యూరింగ్' స్థాయిలోనే ఆగిపోయారు.
ఈ వయసు వర్గంలో సుమారు 50 శాతం మంది ఏదో ఒక రకమైన మానసిక ఒత్తిడి లేదా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే భావోద్వేగాలను ఎదుర్కొంటున్నారని రిపోర్టు స్పష్టం చేసింది.
ఈ విషయాన్ని సేపియన్ ల్యాబ్స్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ తారా త్యాగరాజన్ పేర్కొన్నారు.