Saudi Arabia: చరిత్రలోనే తొలిసారిగా సౌదీలో మంచు వర్షం.. వైరల్‌అవుతున్న ఫొటోలు, వీడియోలు
గల్ఫ్ దేశం సౌదీ అరేబియా అంటే ముందుగా గుర్తొచ్చేది ఎడారి. అక్కడ ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి. కానీ, ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. ఈ ఎడారి దేశంలో చరిత్రలోనే తొలిసారి కొన్ని ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. రోడ్లపై తెల్లటి తివాచీలా మంచు పేరుకుపోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సౌదీ అల్-జౌఫ్ ప్రావిన్స్ పరిధిలో మంచు దుప్పటి కనుచూపు మేర వ్యాపించి చూపరులను కనువిందు చేస్తోంది. సాధారణంగా ఈ ప్రాంతం పొడి వాతావరణంతో ఉంటుంది. ఇక్కడ వర్షాలు పడటం, మంచు కురవడం అరుదైన విషయాలు. కానీ ఇప్పుడు చరిత్రలో తొలిసారి ఈ ప్రాంతంలో తేమతో కూడిన వాతావరణం ఏర్పడి మంచు కురుస్తోంది.
స్థానికులకు యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం హెచ్చరిక
రోడ్లపై ప్రయాణిస్తున్న స్థానికులు ఈ దృశ్యాన్ని చూసి ఆనందిస్తున్నారు. ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. వాతావరణంలో ఈ మార్పుపై యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం స్పందించింది. రాబోయే రోజుల్లో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉరుములు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. మరోవైపు, సౌదీ వాతావరణ విభాగం కూడా తీవ్రమైన వాతావరణ హెచ్చరికలు జారీ చేస్తూ, ప్రతికూల పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని స్థానికులను హెచ్చరిస్తోంది.