
Diwali 2025: మనదేశంలో ఈ ప్రాంతాల్లో జరిగే దీపావళి వెరీ స్పెషల్.. ఒక్కసారైనా మనం చూడాల్సిందే!
ఈ వార్తాకథనం ఏంటి
మన దేశంలో దీపావళిని గొప్ప ఉత్సాహంతో, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించడం, లక్ష్మీదేవి, గణపతికి ప్రత్యేక పూజలు చేయడం, బాణాసంచా కాల్చడం వంటి కార్యక్రమాలు సాధారణంగా కనిపించే దృశ్యాలు. అయితే కొన్ని ప్రాంతాల్లో దీపావళిని ఎంతో భిన్నంగా, అద్భుతంగా జరుపుకుంటారు.జీవితంలో ఒకసారైనా ఆ ప్రాంతాల్లో జరిగే దీపావళి సంబరాలు వీక్షించాల్సిందే. ఆ అందమైన వేడుకలను జరిపే ప్రదేశాల గురించి తెలుసుకుందాం. దీపావళి అనే పదానికి'దీపాల వరుస' అనే అర్థం ఉంది. అమావాస్య చీకట్లను పారద్రోలి వెలుగులతో ఆనందాన్ని పంచే పండుగగా ఇది ప్రసిద్ధి చెందింది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తింపుగా దేశవ్యాప్తంగా దీపావళిని జరుపుకుంటారు. కానీ కొన్ని ప్రాంతాల్లో జరిగే ప్రత్యేక వేడుకలు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి.
Details
అయోధ్య, ఉత్తరప్రదేశ్
రాముడి జన్మస్థలంగా పేరుపొందిన అయోధ్యలో దీపావళి వేడుకలు అద్భుతంగా సాగుతాయి. లక్షలాది మట్టి దీపాలతో నగరం మొత్తం వెలుగుల్లో మెరిసిపోతుంది. శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, లక్ష్మీదేవిని ఆహ్వానించేలా నగరమంతా దీపాలతో అలంకరిస్తారు. సరయు నది తీరంలో జరిగే దీపాల ప్రదర్శన, దేవతల అలంకరించిన విగ్రహాల ఊరేగింపులు ప్రత్యేక ఆకర్షణలు. వారణాసి, ఉత్తరప్రదేశ్ వారణాసిలో దీపావళి రాత్రి ఒక మాయాజాలంలా ఉంటుంది. పగలు-రాత్రి తేడా లేకుండా ప్రజలు వేడుకలు జరుపుకుంటారు. రంగురంగుల బాణాసంచా వెలుగులు ఆకాశాన్ని అలంకరిస్తాయి. నది ఒడ్డున దీపాల కాంతి ప్రతిబింబాలు చిరకాలం గుర్తుండే దృశ్యాలు.
Details
జైపూర్, రాజస్థాన్
దీపావళి సమయంలో జైపూర్ మాయనగరంలా మారిపోతుంది. ఇళ్లు, వీధులు, దుకాణాలు అన్నీ లైట్లతో మెరిసిపోతాయి. సాంప్రదాయ స్వీట్లు ఇక్కడ ప్రత్యేకత. ఆచారాలు, అలంకరణలు, పండుగ సందడి పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తాయి. ఉదయపూర్, రాజస్థాన్ 'సరస్సుల నగరం'గా పేరుగాంచిన ఉదయపూర్‌లో దీపావళి వేడుకలు రాజసంగా ఉంటాయి. లాంతర్న్ ఫెస్టివల్, సరస్సుల్లో దీపాల ప్రతిబింబాలు, రాజభవనాలు, హవేలీల ప్రకాశం చూసేందుకు కన్నులు చాలవు. రాజస్థానీ శైలిలో జరిగే బాణసంచా ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది.
Details
గోవా
బీచ్‌లు, రేవ్ పార్టీలు మాత్రమే కాదు - దీపావళి సమయంలో గోవా తన సాంప్రదాయాన్ని ఘనంగా ప్రదర్శిస్తుంది. ఇక్కడ దీపావళిని 'నరక చతుర్దశి'గా పిలుస్తారు. శ్రీకృష్ణుడు, సత్యభామ నరకాసురుడిపై సాధించిన విజయాన్ని గుర్తుచేస్తూ అతని దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. చెడుపై మంచి సాధనకు ఇది ప్రతీక. ఢిల్లీ దీపావళి సమయంలో ఢిల్లీ పర్యటనకు సరైన సమయం. వీధులు అలంకార కాంతులతో మెరిసిపోతాయి. మార్కెట్లు సందడిగా ఉంటాయి. షాపింగ్‌ప్రియులకు ఇది పండుగలాంటిదే. వివిధ ప్రాంతాల్లో జరిగే దీపావళి కార్నివాళ్లు సందర్శకులను ఆకట్టుకుంటాయి.
Details
అమృత్‌సర్, పంజాబ్
బంగారు నగరం అమృత్‌సర్‌లో దీపావళి సంబరాలు అబ్బురపరుస్తాయి. స్వర్ణ దేవాలయం దీపాల కాంతిలో మరింత వైభవంగా కనిపిస్తుంది. పవిత్ర సరోవర్ చుట్టూ వెలిగించే వేలాది దీపాలు అమృత్‌సర్‌ను తప్పక సందర్శించాల్సిన ప్రదేశంగా నిలబెడతాయి. సిక్కుల ఆరవ గురువు గురు హరగోబింద్ సింగ్ జీ విడుదలను స్మరించుకుంటూ దీపావళిని 'బంది చోర్ దివస్'గా జరుపుకుంటారు.