
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై మహిషాసురమర్దని అలంకారంలో దుర్గమ్మ
ఈ వార్తాకథనం ఏంటి
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో తొమ్మిదో రోజు మహిషాసురమర్దిని అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు.
పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి తరలి వస్తున్నారు. మహిషాసురుడిని సంహరించిన మహోన్నత రూపమే ఇది.
సకల దేవతల శక్తులు ఈ దేవీలో ఏకీకృతమై ఉంటాయి. మానవ కంటికి కనిపించలేని దివ్య తేజస్సుతో, అనేక ఆయుధాలతో, సింహ వాహనంపై తల్లి భక్తులకు దివ్య దర్శనం ఇస్తుంది.
ఈ తల్లి అనుగ్రహం పొందిన వారికి అసాధ్యం ఏదీ లేదు. మహిషాసురుని వధ చేసిన రోజును 'మహర్నవమి'గా జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ.
వివరాలు
సప్తశతీ హోమం చేసే వారికి శత్రువుల భయం ఉండదు
ఈ రోజున చండీ సప్తశతీ హోమం చేసే వారికి శత్రువుల భయం ఉండదు. అన్నీ విజయాలే చేకూరతాయి.
"ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహిన్యై స్వాహా" అనే మంత్రం జపించి, పానకం, వడపప్పు, గారెలు, పులిహోర, పాయసం వంటి ప్రసాదాలు నివేదించాలి.
సువాసినీ పూజ చేసి, మంగళ ద్రవ్యాలు, శక్తికొద్దీ కొత్త వస్త్రాలు సమర్పించాలి.
వివరాలు
పెరిగిన రద్దీ
భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. సాధారణ భక్తులకు దర్శనానికి ప్రాధాన్యత ఇస్తున్నామని వారు తెలియజేస్తున్నారు.
ఇంద్రకీలాద్రి పరిసరాలు ,ఆలయాన్ని సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిశితంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 18 ప్రాంతాలలో ప్రసాదం పంపిణీ కోసం కౌంటర్లు ఏర్పాటు చేశారు.
నదీ స్నానాలకు బదులుగా, సీతమ్మ వారి పాదాల వద్ద భారీగా షవర్లు ఏర్పాటు చేశారు.
కృష్ణానది పవిత్ర హారతుల దృష్ట్యా, దుర్గా ఘాట్ వద్దకు భక్తులను అనుమతించడం లేదు.
చివరి రోజు నిర్వహించే తెప్పోత్సవం విషయంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది.