Ikaria: వందేళ్ల జీవన రహస్యం.. ఇకారియా ప్రజల ఆరోగ్య మంత్రం
ఈ వార్తాకథనం ఏంటి
గ్రీస్‌కు చెందిన ఇకారియా అనే ద్వీపం ప్రపంచవ్యాప్తంగా దీర్ఘాయుష్షుకు ప్రసిద్ధి చెందింది. అక్కడి ప్రజలు సాధారణంగా తొంభై నుంచి వందేళ్లకు పైగా జీవిస్తుంటారు. అందుకే ఈ ప్రాంతాన్ని"మనుషులు మరణించడం మర్చిపోయిన ద్వీపం"అని కూడా పలువురు అభివర్ణిస్తారు. క్యాన్సర్,గుండె సంబంధిత వ్యాధులు వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు అక్కడ చాలా తక్కువగా కనిపిస్తాయి. ఈ ఆరోగ్య రహస్యానికి ప్రధాన కారణంగా అక్కడి ప్రజల జీవన విధానాన్నే పరిశోధకులు చెబుతున్నారు. గ్రీక్ భాషలో "సిగా.. సిగా" అంటే "మెల్లగా"అని అర్థం. ఇకారియా ప్రజలు కూడా అదే విధంగా హడావుడి లేకుండా ప్రశాంతంగా జీవితం గడుపుతారు. చిన్న విషయాలకైనా ఆందోళన చెందకుండా,ఒత్తిడికి దూరంగా ఉంటారు. దీంతో శరీరంలో ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ స్థాయి తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతోంది.
వివరాలు
భౌగోళిక పరిస్థితులు ప్రజల ఆయుర్దాయాన్ని పెంచడంలో కీలక పాత్ర
అక్కడి భౌగోళిక పరిస్థితులు కూడా ప్రజల ఆయుర్దాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎత్తుపల్లాలతో కూడిన కొండ ప్రాంతంగా ఉండటంతో రోజువారీ పనుల కోసం ప్రజలు ప్రతిరోజూ రెండు నుంచి మూడు కిలోమీటర్ల వరకు నడవాల్సి వస్తోంది. కొండలు ఎక్కి దిగే ఈ సహజ వ్యాయామం వారి శరీరాన్ని దృఢంగా ఉంచుతోంది. ఆహారపు అలవాట్లలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తారు. పూర్తిగా సహజ పద్ధతుల్లో పండించిన కూరగాయలు, ఆకుకూరలను ఎక్కువగా తీసుకుంటారు. మాంసాహారాన్ని మాత్రం చాలా అరుదుగానే తింటారు.
వివరాలు
ప్రత్యేక ఆకర్షణగా థెర్మా అనే వేడి నీటి బుగ్గలు
అలాగే అక్కడి ప్రజల మధ్య సామాజిక బంధాలు బలంగా ఉండటం వల్ల ఒంటరితనం కనిపించదు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసిమెలసి జీవించడం వారికి మానసిక ప్రశాంతతను ఇస్తోంది. ఇకారియా ద్వీపంలోని థెర్మా అనే వేడి నీటి బుగ్గలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆ నీటిలో స్నానం చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు. ప్రశాంత జీవనం, సహజ ఆహారం, నిత్య నడక, బలమైన మానవ సంబంధాలే ఇకారియా ప్రజల దీర్ఘాయుష్షు వెనుక అసలు రహస్యంగా భావిస్తున్నారు.