Page Loader
Mahatma Gandhi District: అమెరికాలో ఓ జిల్లాకు గాంధీ పేరు.. ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే..? 
అమెరికాలో ఓ జిల్లాకు గాంధీ పేరు

Mahatma Gandhi District: అమెరికాలో ఓ జిల్లాకు గాంధీ పేరు.. ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 27, 2024
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో మహాత్మా గాంధీ విగ్రహం లేదా గాంధీనగర్ ఉండటం సాధారణమైన విషయం. కానీ, అమెరికాలో కూడా గాంధీ పేరుతో ఓ జిల్లా ఉంది. ఈ జిల్లా టెక్సస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో ఉంది. అమెరికాలోని 59వ నెంబర్ జాతీయ రహదారి వెంట ఉన్న హిల్‌క్రాఫ్ట్ ప్రాంతానికి స్థానికులు 'మహాత్మా గాంధీ డిస్ట్రిక్ట్' అని పేరు పెట్టారు. ఇది ఒక వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందింది. 40 సంవత్సరాల క్రితం, ఇక్కడ కొన్ని దుకాణాలను భారతీయులు వ్యాపారాలు ప్రారంభించారు. ఇప్పుడు వాటి సంఖ్య వందలలోకి చేరింది. టెక్సస్ రాష్ట్రంలో అత్యంత ప్రముఖమైన భారతీయ వ్యాపార కేంద్రంగా 'మహాత్మా గాంధీ డిస్ట్రిక్ట్' పేరు పొందింది.

వివరాలు 

గాంధీ పేరు పెట్టేందుకు అనుమతులు

ఈ అభివృద్ధి వెనుక చాలా కృషి ఉందని రమేశ్ లుల్లా పేర్కొన్నారు. ఆయన హిల్‌క్రాఫ్ట్‌లో మొదటి వ్యాపారికుల్లో ఒకరు. ''హిల్‌క్రాఫ్ట్ వ్యాపార సంఘాన్ని ఏర్పాటు చేసి, నలుగురు వ్యాపారులతో కలిసి కష్టపడ్డాం. దక్షిణాసియా చాంబర్ ఆఫ్ కామర్స్, భారత సాంస్కృతిక శాఖ సహాయంతో స్థానిక నేతలను కలుసుకున్నాం. నగరశాఖ అనుమతులు 40 ఏళ్ల క్రితం రాగా, 14 సంవత్సరాల క్రింద గాంధీ పేరు పెట్టేందుకు అనుమతులు సాధించాం. ఇక్కడ ఒక చరిత్ర సృష్టించినందుకు గర్వంగా ఉంది'' అని రమేశ్ ప్రముఖ మీడియాకి తెలిపారు. రమేశ్ తన వ్యాపారాన్ని ఒక బట్టల దుకాణంతో ప్రారంభించారు, ఇప్పుడు ఆయన ఒక రెస్టారెంట్,అలాగే బొటీక్ కూడా ప్రారంభించారు. ఆయన కుటుంబం మొత్తం వ్యాపారంలో కొనసాగుతోంది.

వివరాలు 

నిబంధనల ప్రకారం 10,000డాలర్లు

హ్యూస్టన్‌లో జరిగే భారతీయ వ్యాపార లావాదేవీలలో 70శాతం మహాత్మా గాంధీ డిస్ట్రిక్ట్‌లో జరుగుతున్నాయని, మిగతా 30 శాతం మిగతా 8 జిల్లాలలో జరుగుతున్నాయని రమేశ్ వివరించారు. భారతీయుల విద్య, విస్తృత జనాభా పెరుగుదలతో ఈ డిస్ట్రిక్ట్ భారతీయ వ్యాపారాలకు కేంద్రంగా మారి.. మరింత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ప్రాంతంలో ఆహారం, నిత్యావసరాలు, బట్టలు, బంగారం, అలంకరణ,వినోదం,ఆధ్యాత్మికత వంటి అవసరాలకు సంబంధించిన వస్తువులు అందుబాటులో ఉన్నాయి. మహాత్మా గాంధీ డిస్ట్రిక్ట్‌లో పాకిస్థాన్,శ్రీలంక వంటి దేశాల నుంచి వచ్చిన వ్యక్తులు కూడా వ్యాపారం చేస్తున్నారు, అయితే అధిక భాగం భారత సంతతి వ్యాపారులకు చెందినది. 2010 జనవరి 16న హిల్‌క్రాఫ్ట్‌కు మహాత్మా గాంధీ పేరును ఇచ్చారు.ఇందుకోసం నిబంధనల ప్రకారం 10,000డాలర్లు స్థానిక వ్యాపారులు చెల్లించారు.

వివరాలు 

అంతర్జాతీయ వ్యాపార సముదాయం

గాంధీ పేరును ఈ ప్రాంతానికి పెట్టడం వారి సాధించిన గొప్ప విజయమని, ఆ పేరు వల్ల ఇతర నగరాల దృష్టి తమ ప్రాంతంపై పడుతోందని రమేశ్ తెలిపారు. ఈ డిస్ట్రిక్ట్‌లో పన్నుల చెల్లింపులు బాగా జరుగుతాయని, స్థానిక ప్రభుత్వం తమకు మంచి సహకారం ఇస్తోందని ఆయన చెప్పారు. ''గాంధీ డిస్ట్రిక్ట్‌కు భారతీయులే కాకుండా, ఇతర దేశాల ప్రజలు, వివిధ జాతులకు చెందినవాళ్లు వస్తున్నారు. దాదాపు 25 శాతం వినియోగదారులు వారే. ఇది ఒక అంతర్జాతీయ వ్యాపార సముదాయం'' అని రమేశ్ చెప్పారు.