
May Day: కార్మికుల పోరాటం విజయవంతం.. 8 గంటల పనివేళలకు నాంది పలికిన ఆ ఘటన ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకోవడం అనవాయితీ. అయితే అమెరికాలో ఆ రోజును 'లాయల్టీ డే'గా పరిగణిస్తారు. చాలా దేశాల్లో మే డే ఒక సెలవు దినంగా జరుపుకుంటారు.
ఈ కార్మిక దినోత్సవం ఒక ప్రత్యేక ఘటనకి పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కులను సమర్థించడానికీ, శ్రమదోపిడిని నివారించడానికీ రూపొందించారు.
19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం కారణంగా, అమెరికా, యూరప్ దేశాలలో పెద్ద పరిశ్రమలు ఏర్పడినాయి.
ఈ పరిశ్రమల్లో కార్మికులు, కనీస సౌకర్యాలు లేకుండా, 16-18 గంటల పాటు శ్రమించవలసి వచ్చారు. దీన్ని నిరసిస్తూ, 1886లో చికాగోలో హే మార్కెట్‌లో జరిగిన కార్మిక ప్రదర్శన మే డే పుట్టుకకు కారణమైంది.
Details
సమ్మె ప్రారంభించిన కార్మికులు
1884లో కార్మికులు రోజుకు 8 గంటల పని సమయం మాత్రమే ఉండాలని ఆందోళనలు ప్రారంభించారు.
1886లో ఈ ఆందోళన తారాస్థాయికి చేరుకుని, 40,000 మంది కార్మికులు సమ్మె ప్రారంభించారు.
ఈ సమ్మె ఉధృతమవడంతో యాజమాన్యాలు, పోలీసుల సహాయంతో కార్మికులపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో కొంతమంది మరణించారు, మరికొంతమంది గాయపడ్డారు.
ఆ సమయంలో జరిగిన ఈ సంఘటన 'హే మార్కెట్ దారుణ హత్యాకాండ'గా చరిత్రలో నిలిచింది.
ఈ సంఘటన తరువాత, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కార్మికులు తమ హక్కులను సాధించడానికి నిరసనలు, ఉద్యమాలు ప్రారంభించారు.
1890లో బ్రిటన్‌లోని హైడ్ పార్క్‌లో 3 లక్షల మంది కార్మికులు పాల్గొని 8 గంటల పని దినం కోసం డిమాండ్ చేశారు.
Details
1923లో మొదటిసారి 'మే డే'
ఈ ఉద్యమం తరువాత, మే 1ని ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు.
1900-1920 మధ్య కాలంలో, ఐరోపా దేశాలలో కార్మికుల సంక్షేమం కోసం సోషలిస్టు పార్టీల ఆధ్వర్యంలో మే 1న నిరసనలు, ప్రదర్శనలు జరిగాయి.
భారతదేశంలో 1862లో కలకత్తా హౌరా రైల్వే స్టేషన్‌లో కార్మికులు సమ్మె చేసి, 1923లో మొదటిసారి 'మే డే'ను పాటించారు.
ట్రేడ్ యూనియన్‌లు 1920లో ఏర్పడిన తరువాత, కార్మికుల చైతన్యం పెరిగింది.
కానీ ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ తరువాత, అసంఘటిత కార్మిక వర్గానికి సంబంధించిన చట్టాలు అమలు అవడం కష్టమైనది.
మే 1 ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కులు, వారి సంక్షేమం, శ్రమ దోపిడిని నిరసించే ఒక ముఖ్యమైన చారిత్రాత్మక దినంగా కొనసాగుతోంది.