
Vijaya dashami 2025: విజయ ముహూర్తం ఎప్పుడు? దసరా రోజున ఆయుధ పూజ ఎందుకు చేస్తారు?
ఈ వార్తాకథనం ఏంటి
సనాతన సంప్రదాయాల్లో జరుపుకునే పండుగలలో చాలా భాగం ధర్మం చెడుపై సాధించిన విజయానికి ప్రతీకలుగా ఉంటాయి. అలాంటి పర్వదినాల్లో అత్యంత ప్రాధాన్యమైంది విజయదశమి. దుష్టులైన,లోకానికి హానికరమైన రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు వారి స్వభావానికి అనుగుణంగా అనేక అవతారాలు ధరించి యుద్ధం చేశారు. అందుకే దసరా నవరాత్రుల్లో ఆమెను శక్తి స్వరూపిణిగా ఆరాధిస్తారు. రాక్షసత్వం అనేది అజ్ఞానానికి సూచకం. ప్రజల్లోని అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞానాన్ని నింపాలని అమ్మవారు అనేక రూపాలు దాల్చి సృష్టికి మేలు చేశారు. దసరా చివరి రోజైన విజయదశమి నాడు ఆమెను శ్రీరాజరాజేశ్వరిగా అత్యంత భక్తి, శ్రద్ధలతో ఆరాధిస్తారు. అన్నీ తానై, అంతా తానై ఉన్న శక్తి స్వరూపిణి విశ్వరూపం గల మహారాజ్ఞి.
వివరాలు
విజయ ముహూర్తం ఎప్పుడు? ఏం చేయాలి?
ఇంతకీ దసరా రోజున విజయ ముహూర్తం ఎప్పుడొస్తుంది? ఎంతసేపు ఉంటుంది? ఆ సమయంలో ఏమేం చేయాలో చూద్దాం. జ్యోతిష పండితుల అభిప్రాయం ప్రకారం, విజయదశమి రోజంతా శుభదాయకమే అయినప్పటికీ, విజయ ముహూర్తం ప్రత్యేకంగా శ్రేష్ఠమైన సమయంగా పరిగణించబడుతుంది. సూర్యుడు ఎనిమిదో, ఏడో స్థానంలో ఉండగా, సూర్యోదయ లగ్నానికి ఐదో లేదా ఆరవ లగ్నం వచ్చినప్పుడు ఏర్పడే సమయాన్ని విజయ ముహూర్తం అంటారు. జ్యోతిష శాస్త్రంలో ఒక ముహూర్తం అంటే 48 నిమిషాలు. దుర్ముహూర్తాలు లేకుండా, సూర్యుడు బలంగా ఉన్న సమయం విజయదశమి నాడు వస్తే దానినే విజయ ముహూర్తంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ప్రారంభించే పనులు తప్పకుండా విజయవంతమవుతాయని విశ్వాసం.
వివరాలు
ఆయుధ పూజ వెనుక ఆధ్యాత్మిక సందేశం
2025 అక్టోబర్ 2న విజయ ముహూర్తం మధ్యాహ్నం 2.10 గంటల నుంచి 2.58 గంటల వరకు ఉంటుంది. ఈ 48 నిమిషాలు అత్యంత శక్తివంతమైనవి. ఈ సమయంలో కొత్త ఆలోచనలు, వ్యాపారాలు, ప్రాజెక్టులు ప్రారంభిస్తే తప్పక విజయం లభిస్తుందని నమ్మకం ఉంది. విజయదశమి నాడు ప్రతి ఒక్కరూ అమ్మవారు చెడుపై సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ పూజలు నిర్వహిస్తారు. అమ్మవారికి పిండి వంటలు నివేదిస్తారు, ఉపచారాలు చేస్తారు. విజయదశమి అనేది ప్రధానంగా శక్తి ఆరాధన పర్వదినం. అమ్మవారికి విజయం అందించిన ఆయుధాలను పూజించడం, అలాగే మన జీవిత పోరాటంలో వృత్తికి ఉపయోగపడే పరికరాలను దైవంగా భావించడం ఈ పర్వం యొక్క ప్రధానత.
వివరాలు
ఆయుధ పూజ వెనుక ఆధ్యాత్మిక సందేశం
ఇది కేవలం మనకు ఉపకరించే వస్తువుల పట్ల గౌరవం చూపడమే కాకుండా, ప్రపంచంలోని ప్రతి దాంట్లోనూ దైవశక్తి ఉందని గుర్తు చేసే ఆధ్యాత్మిక సందేశం కూడా కలిగిస్తుంది. అంటే, దేవుడు ఒక స్వరూపంలోనే కాదు, మనకు ఉపయోగపడే ప్రతి వస్తువులోనూ, ప్రతి శక్తిలోనూ ఉంటాడనే అవగాహన కలిగించడమే ఆయుధ పూజలోని గొప్ప తత్వం.