National Science Day 2025: ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?
ఈ వార్తాకథనం ఏంటి
ఈ రోజు జాతీయ సైన్సు దినోత్సవం. దేశవ్యాప్తంగా ఉన్న శాస్త్రీయ పరిశోధనా సంస్థలు ఈ రోజును పురస్కరించుకుని "ఓపెన్ డే" నిర్వహిస్తాయి.
విద్యార్థులకు శాస్త్రంపై ఆసక్తిని పెంపొందించేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తాయి. కానీ ఫిబ్రవరి 28నే జాతీయ సైన్స్ దినోత్సవంగా ఎందుకు గుర్తించారు తెలుసా?
ఇదే రోజు భారతీయ భౌతిక శాస్త్రవేత్త చంద్రశేఖర వెంకట రామన్ తన సంచలనాత్మక "రామన్ ఎఫెక్ట్" ను కనుగొన్నారు.
ఈ పరిశోధన మన దేశానికి తొలి సైన్స్ నోబెల్ బహుమతిని తెచ్చిపెట్టింది.
అంతేకాకుండా, ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్న తొలి ఏషియన్, తొలి శ్వేతజాతీయేతర శాస్త్రవేత్త రామన్ గారే. అందుకే ఈ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా పాటించడం ఆనవాయితీగా మారింది.
వివరాలు
సీ.వి. రామన్ ఎవరు?
చంద్రశేఖర రామనాథన్ అయ్యర్, ఒక స్కూల్ టీచర్. ఆయనకు ఎనిమిది మంది పిల్లలు, వారిలో రెండోవాడు రామన్.
చిన్నతనం నుంచే ఆయనకు భౌతిక శాస్త్రంపై మక్కువ. పదహారేళ్లకే ఫిజిక్స్, ఇంగ్లీష్‌లలో బంగారు పతకాలతో డిగ్రీ పూర్తిచేశారు.
కేవలం 18 ఏళ్లకే, ఆయన రాసిన సైంటిఫిక్ పేపర్ బ్రిటిష్ జర్నల్‌లో ప్రచురితమైంది.
పరిశోధన కోసం ఇంగ్లండ్ వెళ్లాలనుకున్నా, ఆరోగ్య సమస్యల కారణంగా కోల్‌కతాలో అకౌంటెంట్‌గా ఉద్యోగంలో చేరారు.
అయినా తన ఖాళీ సమయాన్ని పరిశోధనకే అంకితమిచ్చారు. కొంతకాలం తర్వాత ప్రొఫెసర్‌గా పనిచేసి, రాయల్ సొసైటీ సభ్యత్వాన్ని పొందారు.
మొదట్లో ధ్వనితత్వంపై ప్రయోగాలు చేసినా, క్రమంగా కాంతి శాస్త్రంపై ఆసక్తి పెంచుకున్నారు.
వివరాలు
రామన్ ఎఫెక్ట్ ఎలా పుట్టింది?
ఒకసారి యూరప్ నుంచి తిరిగి వస్తూ, రామన్ ఓ నౌక డెక్‌పై కూర్చుని మధ్యధరా సముద్రం నీలి వర్ణాన్ని గమనిస్తున్నారు.
అప్పటివరకూ, సముద్రానికి రంగు నీలం గానిపించడానికి కారణం నీలాకాశం ప్రతిబింబించడం అనుకునేవారు.
కానీ ఆకాశం రంగు మారినప్పుడు సముద్రం కూడా మారాల్సింది, మరి సముద్రపు నీలం ఇంకా గాఢంగా ఎందుకు కనిపిస్తోంది?" ఈ సందేహం రామన్‌కి కలిగింది.
అసలు శాస్త్రవేత్తకి ఏదైనా సందేహం వస్తే అది ఊరుకుంటుందా? వెంటనే పరిశోధన ప్రారంభించారు.
అదే సమయంలో ఎక్స్-రేపై పనిచేసిన క్రాంప్టన్‌కు 1927లో నోబెల్ బహుమతి లభించింది.
ఇది రామన్‌కు మరింత ప్రేరణనిచ్చింది. చివరకు తన పరిశోధన ద్వారా కాంతి కిరణాలు భిన్నమైన మార్గాల్లో వ్యాప్తి చెందుతాయని నిరూపించి, 1928లో "రామన్ ఎఫెక్ట్" కనుగొన్నారు.
వివరాలు
భారతదేశానికి తొలి సైన్స్ నోబెల్
రామన్ తన పరిశోధన నోబెల్ స్థాయి అని నమ్మారు, చివరకు 1930లో ఆయన కల నిజమైంది.
భారతదేశానికి తొలి సైన్స్ నోబెల్‌ను అందించిన గొప్ప శాస్త్రవేత్తగా చరిత్రలో నిలిచిపోయారు.
ఆయన బెంగళూరులోని "ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్" డైరెక్టర్‌గా పనిచేసి, 1948లో రిటైరయ్యాక స్వంతంగా "రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్" స్థాపించారు.
సీ.వి. రామన్ చేసిన కృషి ప్రభావంతో, నేటికీ ఎన్నో శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయి. ఆయన శాస్త్ర పరిశోధనలకు ప్రేరణగా నిలిచారు.