International Women's Day 2025:మార్చి 8నే మహిళ దినోత్సవం ఎందుకు?.. ఆ రోజు ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం!
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతేడాది మార్చి 8న జరుపుకుంటారు.
ఈ రోజు మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విజయాలను గౌరవించేందుకు, లింగ సమానత్వం, హింసాపై అవగాహన పెంచేందుకు ప్రత్యేకంగా నిర్వహిస్తారు.
మహిళల హక్కులను గుర్తుచేసుకోవడం, సమాజాన్ని, దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడంలో వారి పాత్రను హైలైట్ చేయడం దీని ప్రధాన లక్ష్యంగా చెప్పుకోవచ్చు.
Details
భారతదేశంలో మహిళల స్థానం
భారతదేశం పురుషాధిక్య దేశమనే విషయం మనందరికీ తెలుసు. నేటికీ పురుషుల కంటే మహిళలకు తక్కువ అవకాశాలు, తక్కువ గౌరవం లభిస్తున్నాయి.
అయితే కాలక్రమేణా మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు.
వారిలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి, ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక గొప్ప వేదికగా నిలుస్తోంది.
మార్చి 8నే ఎందుకు జరుపుకుంటారు?
ఈ దినోత్సవం ఉత్తర అమెరికా, ఐరోపా దేశాల్లో కార్మిక ఉద్యమాల నుంచి ఉద్భవించింది.
మహిళల సమానత్వం, అభివృద్ధి కోసం అవగాహన పెంచడం, లింగ సమానత్వాన్ని వేగవంతం చేయడం, మహిళా సంక్షేమ సంస్థలకు నిధులను సమకూర్చడం వంటి లక్ష్యాలతో అనేక కార్యక్రమాలు చేపడతారు.
Details
ఇలా మొదలైంది
1908లో అమెరికాలో 15 వేల మంది మహిళలు న్యూయార్క్ వీధుల్లో తమ హక్కుల కోసం ప్రదర్శనలు చేశారు. వారు ఉద్యోగాల్లో సమాన వేతనం, పనిహగ్గుల పెంపు, ఓటు హక్కును డిమాండ్ చేశారు.
దీని ప్రభావంతో 1909లో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా ఫిబ్రవరి చివరి ఆదివారం మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించింది.
1917లో రష్యాలో మహిళలు శాంతి కోసం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ ఉద్యమం వల్ల చక్రవర్తి నికోలస్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
అదే సమయంలో, మహిళల ఓటు హక్కును అధికారికంగా గుర్తించారు. దీంతో యూరోప్‌లోని ఇతర దేశాల్లో కూడా మార్చి 8న మహిళా హక్కుల కోసం ర్యాలీలు ప్రారంభమయ్యాయి.
Details
అధికారికంగా ప్రకటించిన ఐక్యరాజ్య సమితి
1975లో ఐక్యరాజ్యసమితి మార్చి 8న అధికారికంగా 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం'గా గుర్తించింది.
అప్పటి నుంచి ఈ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా మహిళల సాధికారత, హక్కుల పెంపుకు అంకితమయ్యింది.
ఈరోజు పురుషులు, మహిళలు కలిసి లింగ సమానత్వం కోసం పని చేయాలి.
మహిళలకు సమాన అవకాశాలు, హక్కులు కల్పించేందుకు కృషి చేయడం అనివార్యమని ఈ దినోత్సవం మనకు గుర్తు చేస్తుంది.