ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2023: భారతదేశ ప్రజల ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలు
1948 ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థాపించబడింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 7వ తేదీని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుతున్నారు. 1950 నుండి ఇలా జరుపుకోవడం మొదలుపెట్టారు. ఆరోగ్యం మీద అందరికీ అవగాహన కలిగించడానికి, అలాగే ప్రపంచ దేశాల ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యల గురించి చర్చించడానికి ఈ రోజును జరుపుతారు. ప్రతీ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవానికి ఏదో థీమ్ ఉంటుంది. ఈ సంవత్సరం అందరికీ ఆరోగ్యం అనేతో థీమ్ తో వచ్చారు. ఆరోగ్యమనేది ఒక ప్రాథమిక హక్కుగా.. కులం, మతం, ప్రాంతం, ధనం, ఎలాంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికీ సరైన ఆరోగ్యం అందించాలన్న లక్ష్యాన్ని ఈ సంవత్సరం పెట్టుకున్నారు.
భారతదేశంలో ఆరోగ్య పరిస్థితి
భారతదేశంలో ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 2020-21 ఆర్థిక సర్వే ప్రకారం భారతదేశంలో ప్రతీ 1456మంది ప్రజలకు ఒకరు డాక్టర్ గా ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం డాక్టర్, జనాభా నిష్పత్తి 1:1000గా ఉండాలి. జాతీయ ఆరోగ్య వివరాలు 2019 ప్రకారం, మన దేశంలోని కేవలం 11రాష్ట్రాలకు మాత్రమే డాక్టర్, జనాభా నిష్పత్తి 1: 1000గా ఉంది. అంటే మిగతా రాష్ట్రాలన్నీ డాక్టర్, జనాభా నిష్పత్తిలో చాలా వెనుకబడి ఉన్నాయి. భారత దేశ ప్రజలను ఇబ్బంది పెడుతున్న వ్యాధులు ముఖ్యంగా డయాబెటిస్, గుండె సంబంధ వ్యాధులు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు భారతదేశ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ వ్యాధులు వచ్చిన వారిలో మరణాల రేటు ఎక్కువగా ఉంది.