వరల్డ్ టీబీ డే: క్షయ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు, జనాల్లో ఉన్న అపనమ్మకాలు
ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని మార్చ్ 24వ తేదీన జరుపుకుంటారు. ఈ సంవత్సరం టీబీ డే థీమ్ ఏంటంటే, "అవును, మనం క్షయ వ్యాధిని అంతం చేయగలం". టీబీ దినోత్సవం రోజున టీబీ గురించి జనాల్లో ఉన్న అపనమ్మకాల గురించి తెలుసుకుని, క్షయను ఎదుర్కోవడానికి ఏం చేయాలో చూద్దాం. అపోహా: టీబీ ఊపిరితిత్తులకు మాత్రమే వస్తుంది ఇది తప్పు, టీబీ ఏ అవయవానికైనా రావచ్చు. వెన్నెముక, మెదడు, కాలేయం ఇలా ఏ అవయవానికైనా రావచ్చు. అపోహ: టీబీకి మందు లేదు ఇది పూర్తిగా తప్పు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీబీకి మందులు లభిస్తున్నాయి. అది కూడా ఉచితంగా.
క్షయ వ్యాధి లక్షణాలు, రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇప్పుడు క్షయ వ్యాధి లక్షణాలు చూద్దాం. క్షయ వ్యాధి ఊపిరితిత్తులకు సోకితే దగ్గు ఎక్కువగా ఉంటుంది. రెండు వారాలకు మించి దగ్గు ఉన్నా, ఆకలి తగ్గిపోయినా, ఊరికే చమటలు పట్టడం ఎక్కువగా జరుగుతున్నా వైద్యుడిని సంప్రదించాలి. తెమడలో రక్తం రావడం, పొట్ట ఉబ్బడం మొదలగు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. సాధారణంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి క్షయ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ. సిగరెట్, బీడీ తాగేవారు, డయాబెటిస్, హెచ్ ఐ వీ వ్యాధిగ్రస్తులకు క్షయ తొందరగా సోకే అవకాశం ఉంటుంది. క్షయ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు: పోషకాహారం తీసుకోవాలి. సిగరెట్, మందు అలవాట్లను మానుకోవాలి. వాయుకాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివాసం ఉండకూడదు. వ్యక్తిగత శుభ్రత ఖచ్చితంగా పాటించాలి.