థైరాయిడ్ అవగాహన దినోత్సవం 2023: థైరాయిడ్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
థైరాయిడ్ వ్యాధి కారణంగా ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందనే విషయాల మీద అవగాహన కలగజేయడానికి ప్రతీ ఏడాది మే 25వ తేదిన ప్రపంచ థైరాయిడ్ అవగాహన దినోత్సవాన్ని జరుపుతారు. థైరాయిడ్ ని తొందరగా గుర్తించడం, థైరాయిడ్ ను అర్థం చేసుకోవడం, థైరాయిడ్ వల్ల కలిగే ఇబ్బందులను తెలుసుకోవడం వంటి విషయాలపై అవగాహన కార్యక్రమాలను ఈరోజున నిర్వహిస్తారు. థైరాయిడ్ అవగాహన దినోత్సవం చరిత్ర: 2007 మే 25వ తేదీన థైరాయిడ్ అవగాహన దినోత్సవాన్ని మొట్టమొదటగా జరుపుకున్నారు. యూరోపియన్ థైరాయిడ్ అసోసియేషన్ జనరల్ మీటింగ్ లో ఈ విషయమై తీర్మానం జరిగింది. మే 25 ప్రత్యేకత ఏమిటంటే: 1965 మే 25న యూరోపియన్ థైరాయిడ్ అసోసియేషన్ ఏర్పడింది. అందుకే మే 25వ తేదీని ఎంచుకున్నారు.
థైరాయిడ్ లక్షణాలు, రకాలు
జీవక్రియను, శరీర ధర్మాలను నిర్వర్తించే హార్మోన్లను ఉత్పత్తి చేయడం, నియంత్రించడంలో థైరాయిడ్ గ్రంధి కీలక పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ వ్యాధుల్లో రెండు రకాలుంటాయి. థైరయిడ్ హార్మోన్ ఎక్కువగా విడుదలైతే హైపర్ థైరాయిడిజం అనీ, కావాల్సిన దానికన్నా తక్కువగా విడుదలైతే హైపోథైరాయిడిజం అని అంటారు. హైపర్ థైరాయిడిజం అటాక్ అయితే బరువు తగ్గడం, హృదయ స్పందనలు పెరగడం, అనవసర చిరాకు ఉంటుంది. హైపో థైరాయిడిజం అటాక్ అయితే బరువు పెరగడం, అలసట, ఒత్తిడి, చల్లని నీళ్ళంటే ఇబ్బంది అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. థైరాయిడ్ ని తొందరగా గుర్తించకపోతే అనేక తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. అందుకే థైరాయిడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.