Loading...
Vivien He: 16 ఏళ్ల విద్యార్థిని అద్భుత ఆవిష్కరణ.. రూ.8 వేలకే భూకంప హెచ్చరిక పరికరం
16 ఏళ్ల విద్యార్థిని అద్భుత ఆవిష్కరణ.. రూ.8 వేలకే భూకంప హెచ్చరిక పరికరం

Vivien He: 16 ఏళ్ల విద్యార్థిని అద్భుత ఆవిష్కరణ.. రూ.8 వేలకే భూకంప హెచ్చరిక పరికరం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 28, 2026
05:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాలిఫోర్నియాకు చెందిన 16 ఏళ్ల విద్యార్థిని వివియన్ హే రూ.8 వేలలోపే ఖర్చుతో చిన్న భూకంప గుర్తింపు పరికరాన్ని రూపొందించింది. 'క్యూబ్‌ (Qube)'గా పిలిచే ఈ పరికరం నేలలో వచ్చే ప్రకంపనలను గుర్తించి అలారం, టెక్స్ట్‌ మెసేజ్‌ల ద్వారా హెచ్చరికలు పంపుతుంది. రూబిక్స్‌ క్యూబ్‌ పరిమాణంలో ఉండే దీన్ని తయారు చేసేందుకు 100 డాలర్ల కంటే తక్కువ ఖర్చవుతుంది. భూకంపాల ముందస్తు హెచ్చరిక సాంకేతికతను మరింత మందికి అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో దీనిని అభివృద్ధి చేశారు. సంప్రదాయ భూకంప పర్యవేక్షణ వ్యవస్థలు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి పరికరాలు ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే భూకంపం ప్రారంభం కాకముందే దాన్ని అంచనా వేసే పరికరం కాదని గుర్తుంచుకోవాలి.

వివరాలు 

క్యూబ్‌ ఎలా పనిచేస్తుంది?

క్యూబ్‌ పరికరంలో భూమి కదలికలను గుర్తించేందుకు జియోఫోన్‌ అనే సెన్సర్‌ను ఉపయోగించారు.

భూమిలో ప్రయాణించే ప్రకంపనలను ఈ సెన్సర్‌ గుర్తిస్తుంది.

పరికరంలోని హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ ఆ సంకేతాలను విశ్లేషించి భూకంప కార్యకలాపాలను గుర్తిస్తాయి.

ప్రకంపనలు నిర్దేశించిన స్థాయిని దాటినప్పుడు వై-ఫై ద్వారా హెచ్చరికలను పంపుతుంది.

భూకంపం గుర్తించిన వెంటనే అలారం మోగించడంతో పాటు, హెచ్చరికలకు సబ్‌స్క్రైబ్‌ అయిన వారికి టెక్స్ట్‌ మెసేజ్‌లు పంపేలా దీన్ని రూపొందించారు.

దీంతో బలమైన ప్రకంపనలు తమ ప్రాంతానికి చేరుకునేలోపే ప్రజలకు సమాచారం అందే అవకాశం ఉంటుంది.

వివరాలు 

లాస్‌ ఏంజెలిస్‌లో క్యూబ్‌ పరీక్ష..  

వివియన్‌ హే 2020 సెప్టెంబర్‌ నుంచి 2021 మే వరకు తొమ్మిది నెలల పాటు లాస్‌ ఏంజెలిస్‌ ప్రాంతంలో క్యూబ్‌ను పరీక్షించింది.

ఈ ప్రయోగ సమయంలో పర్యవేక్షించిన ప్రాంతంలో 3.0 కంటే ఎక్కువ తీవ్రత కలిగిన భూకంపాలను పరికరం గుర్తించింది.

సమీపంలో సంభవించిన 2.3 తీవ్రత కలిగిన కొన్ని చిన్న భూకంపాలను కూడా నమోదు చేసింది.

2020 సెప్టెంబర్‌ 19న సంభవించిన 4.5 తీవ్రత భూకంపాన్ని క్యూబ్‌ గుర్తించి హెచ్చరిక జారీ చేసింది.

పరికరం నమోదు చేసిన భూకంప తరంగాల సమాచారం సమీపంలోని అధికారిక సీస్మోమీటర్‌ నమోదు చేసిన డేటాతో సరిపోలింది.

ADVERTISEMENT

వివరాలు 

భూకంపం రాకముందు కాదు.. ప్రకంపనలు మొదలైన తర్వాతే హెచ్చరిక

అయితే క్యూబ్‌ భూకంపాలు సంభవించే ముందే వాటిని అంచనా వేయదు.

భూకంపం ప్రారంభమైన తర్వాత ఏర్పడే ప్రకంపనలను ఈ పరికరం గుర్తిస్తుంది.

భూకంప ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు మొదటగా వేగంగా ప్రయాణించే భూకంప తరంగాలను గుర్తించి, ఆ తర్వాత వచ్చే బలమైన ప్రకంపనలకు ముందే ప్రజలకు సమాచారం అందిస్తాయి.

భూకంప కేంద్రానికి ఎంత దూరంలో ఉన్నారనే దానిపై ఆధారపడి ప్రజలకు స్పందించేందుకు కొన్ని సెకన్ల సమయం లభించే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

పనితీరుపై మరిన్ని పరీక్షలు అవసరం

ఇలాంటి తక్కువ ఖర్చుతో పనిచేసే సెన్సర్లను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేస్తే స్థానికంగా భూకంపాలను పర్యవేక్షించే సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది.

మరింత మందికి ముందస్తు హెచ్చరికలు అందించడంలో ఇవి ఉపయోగపడొచ్చు.

అయితే వివిధ రకాల భౌగోళిక పరిస్థితుల్లో క్యూబ్‌ పనితీరు ఎలా ఉంటుంది, హెచ్చరికలు ఎంత నమ్మకంగా ఉంటాయి, బలమైన ప్రకంపనలు చేరుకునేలోపు ఎంత సమయం ముందుగా సమాచారం అందించగలదు అనే అంశాలపై మరిన్ని పరీక్షలు అవసరం.

ADVERTISEMENT