
ChatGPT: రోజుకు 2.5 బిలియన్ల ప్రాంప్ట్‌లతో, సరికొత్త గూగుల్‌లా చాట్‌జీపీటీ మారుతుందా?
ఈ వార్తాకథనం ఏంటి
టెక్నాలజీ ప్రపంచంలో చాట్‌జీపీటీ (ChatGPT) వేగంగా దూసుకెళుతోంది. వినియోగదారుల అవసరాలను తీర్చడంలో,సందేహాలను నివృత్తి చేయడంలో ఇది సరికొత్త గూగుల్‌లా మారిపోతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఓపెన్‌ఏఐ సంస్థ యాక్సియోస్ అనే పత్రికకు వెల్లడించింది. చాట్‌జీపీటీ ప్రస్తుతం రోజుకు 250 కోట్ల ప్రాంప్ట్‌లను (వినియోగదారుల ప్రశ్నల రూపంలో వచ్చే అభ్యర్థనలను) నిర్వహించుతోందని సంస్థ తెలిపింది. అమెరికా దేశం నుంచే రోజుకు సుమారు 3.3 కోట్ల ప్రాంప్ట్‌లు వస్తున్నాయని పేర్కొంది. సంవత్సర ప్రాతిపదికన చూస్తే ఈ సంఖ్య 91 వేల కోట్ల వరకు పెరిగే అవకాశముందని ఓపెన్‌ఏఐ వివరించింది. ఆన్‌లైన్‌లో వినియోగదారుల రోజువారీ కార్యకలాపాల్లో చాట్‌జీపీటీ ఎంత కీలక పాత్ర పోషిస్తోంది అన్నదానికి ఇది స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తోంది.
వివరాలు
మూడు నెలల్లోనే 500 మిలియన్లకు..
అయితే ఇప్పటికీ గూగుల్‌తో పోలిస్తే చాట్‌జీపీటీ చాలా వెనుకబడి ఉందని చెప్పాల్సిందే. గూగుల్‌లో మాత్రం సంవత్సరానికి 5 లక్షల కోట్ల సార్లు సెర్చ్‌లు జరుగుతాయని వెల్లడించారు. కానీ చాట్‌జీపీటీ ప్రస్తుత వేగాన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో గూగుల్‌కు బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగగలదనే అంచనాలు వినిపిస్తున్నాయి. 2023 డిసెంబర్ నాటికి చాట్‌జీపీటీ బాట్‌ను వారానికి 300 మిలియన్ల మంది మాత్రమే వాడుతున్నారని పేర్కొన్నారు. అయితే కేవలం మూడు నెలల్లోనే ఈ సంఖ్య 500 మిలియన్లకు పెరిగిందని తెలిపారు. వీరిలో ఎక్కువ మంది ఉచిత వెర్షన్‌ను ఉపయోగించేవారే అని వివరించారు.
వివరాలు
కృత్రిమ మేధ (AI) ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ అందుబాటులో ఉండాలి
ఇంతేకాకుండా చాట్‌జీపీటీ కూడా ఏఐ ఆధారిత వెబ్ బ్రౌజర్‌ను తీసుకురావాలని యత్నిస్తున్నట్లు కథనాలు చెబుతున్నాయి. అది నేరుగా గూగుల్ క్రోమ్‌కు పోటీగా మారే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో చాట్‌జీపీటీ ఏజెంట్‌ను కూడా ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ ఈ వారం వాషింగ్టన్ డీసీని సందర్శించనున్నారు. ఈ సందర్బంగా "కృత్రిమ మేధ (AI) ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ అందుబాటులో ఉండాలి" అనే సందేశాన్ని ప్రజలకు చేరవేయనున్నారని యాక్సియోస్ నివేదిక పేర్కొంది.