Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక మార్పు.. ఆ ముఖ్యమైన ఫీచర్‌కు గుడ్‌బై!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే ఫోటో, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ తన ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ ఫీచర్‌ను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ మార్పు 2026 మే8 నుంచి అమల్లోకి రానుంది. దీంతో యూజర్లు ఇకపై యాప్‌లో ఎన్‌క్రిప్టెడ్ చాట్‌లను ఉపయోగించలేరు. ఈ విషయాన్ని మెటా తన తాజా బ్లాగ్ పోస్ట్‌లో అధికారికంగా వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సదుపాయాన్ని మొదటగా డిసెంబర్ 2023లో ప్రవేశపెట్టారు. ఈ ఫీచర్ ద్వారా పంపిన సందేశాలను కేవలం పంపిన వ్యక్తి, స్వీకరించిన వ్యక్తి మాత్రమే చదవగలుగుతారు. మధ్యలో మరెవరికీ ఆ సందేశాలు కనిపించవు. అయితే ఈ ఫీచర్ తొలగించబడటంతో, ఇన్‌స్టాగ్రామ్ చాట్‌లలో ఇప్పటివరకు ఉన్న అదనపు గోప్యతా రక్షణ తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Details
మెటా పూర్తి వివరణ ఇవ్వలేదు
ఎన్‌క్రిప్షన్ ఫీచర్ పూర్తిగా నిలిపివేయడానికి ముందు, యూజర్లు తమ ప్రస్తుత చాట్‌లు, మీడియా ఫైళ్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు మెటా తెలిపింది. ఈ ప్రక్రియకు సంబంధించిన సూచనలు యాప్‌లోనే కనిపిస్తాయి. అయితే చాలా కాలంగా యాప్‌ను అప్‌డేట్ చేయని యూజర్లు ముందుగా తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయాల్సి ఉండొచ్చు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్‌ను ఎందుకు తొలగిస్తున్నారనే విషయంపై మెటా పూర్తి వివరణ ఇవ్వలేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు ఆన్‌లైన్ భద్రతపై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.
Details
సోషల్ మీడియా సంస్థలపై కఠినమైన నిబంధనలు అమలు
ముఖ్యంగా పిల్లల దోపిడీ లేదా చట్టవిరుద్ధ కంటెంట్ ఎన్‌క్రిప్టెడ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వ్యాప్తి చెందుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక దేశాలు సోషల్ మీడియా సంస్థలపై కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఉదాహరణకు యూరప్‌లో ప్రతిపాదించిన EU చాట్ కంట్రోల్ రెగ్యులేషన్ అలాగే బ్రిటన్‌లో అమల్లో ఉన్న ఆన్‌లైన్ సెఫ్టీ యాక్ట్ 2023 వంటి చట్టాలు హానికరమైన కంటెంట్‌ను గుర్తించి తొలగించేందుకు టెక్ కంపెనీలు బాధ్యత వహించాలనే నిబంధనలు పెట్టాయి. ఈ కొత్త నియంత్రణలను అమలు చేయడం సులభం కావడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్‌క్రిప్టెడ్ చాట్‌లను నిలిపివేయాలని మెటా నిర్ణయించినట్లు టెక్నాలజీ నిపుణులు భావిస్తున్నారు.