Bharat Semi: ఒకే చిప్‌లో ఏఐ, ఇమేజ్ ప్రాసెసింగ్.. భారత స్టార్టప్‌కు 24 మిలియన్ డాలర్ల పెట్టుబడులు
ఈ వార్తాకథనం ఏంటి
భారత సెమీకండక్టర్ రంగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశీయ స్టార్టప్ భారత్ సెమీ (Bharat Semi) ఏఐ ఆధారిత ఇమేజ్ సెన్సార్ల అభివృద్ధి కోసం 24 మిలియన్ డాలర్ల (సుమారు రూ.200 కోట్లకు పైగా) సీడ్ ఫండింగ్ సమీకరించింది. అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లలో తన ఉత్పత్తులకు కస్టమర్లను సంపాదించడమే లక్ష్యంగా ఈ సంస్థ ముందుకెళ్తోంది. దాదాపు ఐదేళ్ల చరిత్ర ఉన్న ఈ స్టార్టప్ ఇప్పటివరకు ఆదాయాన్ని ఆర్జించే దశకు చేరుకోలేదు. అయినప్పటికీ అమెరికాకు చెందిన రక్షణ సాంకేతిక సంస్థ జనరల్ అటామిక్స్ (General Atomics), భారతదేశంలోని కేన్స్ సెమికాన్ (Kaynes Semicon) సంస్థల నుంచి డిజైన్ విన్‌లు సాధించినట్లు వెల్లడించింది.
వివరాలు
ఏఐ బూమ్‌తో భారత చిప్ స్టార్టప్‌లకు అవకాశాలు
ప్రస్తుతం ఇమేజ్ సెన్సార్ల అభివృద్ధి కొనసాగుతుండగా.. 2027లో తొలిసారిగా వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
దేశీయ సెమీకండక్టర్ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు భారత్ ఇప్పటికే బిలియన్ డాలర్ల పెట్టుబడులకు కట్టుబడింది.
చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు అమెరికా కంపెనీలు తమ సరఫరా వ్యవస్థలను ఇతర దేశాలకు విస్తరిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భారత్‌ను ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యం. అయితే ఇప్పటివరకు ప్రపంచంలోని ప్రధాన చిప్ తయారీ కేంద్రాల్లో ఒకటిగా భారత్ గుర్తింపు పొందలేదు.
మరోవైపు, కృత్రిమ మేధ (AI) రంగంలో వేగంగా పెరుగుతున్న డిమాండ్ భారత్ సెమీ వంటి స్టార్టప్‌లకు ప్రత్యేక చిప్‌లను అభివృద్ధి చేసి అంతర్జాతీయ మార్కెట్లలోకి ప్రవేశించే అవకాశాన్ని కల్పిస్తోంది.
వివరాలు
ఒకే చిప్‌లో ఇమేజ్ క్యాప్చర్, ప్రాసెసింగ్, ఏఐ
న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ సెమీ.. ప్రోగ్రామబుల్ ఇమేజ్ సెన్సార్లను అభివృద్ధి చేస్తోంది. వీటిలో ఇమేజ్ క్యాప్చర్, ప్రాసెసింగ్, ఏఐ సామర్థ్యాలను ఒకే చిప్‌లో అనుసంధానించనున్నారు.
సాధారణంగా ఇమేజ్ సెన్సార్, ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్, సిస్టమ్ ఆన్ చిప్ (SoC) వంటి వేర్వేరు భాగాలు అవసరమవుతాయి.
అయితే భారత్ సెమీ రూపొందిస్తున్న సాంకేతికతతో విజువల్ డేటాను ప్రత్యేక ప్రాసెసర్లకు పంపాల్సిన అవసరం తగ్గుతుంది.
దీంతో సంప్రదాయ విధానాలతో పోలిస్తే సిస్టమ్ ఖర్చులను కనీసం 70 శాతం తగ్గించవచ్చని సంస్థ సహ వ్యవస్థాపకురాలు వృందా కపూర్ తెలిపారు.
''సెన్సార్ల స్థాయి నుంచి సమాచారాన్ని అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకునే పరిష్కారాల దిశగా వెళ్లడమే మా లక్ష్యం'' అని ఆమె టెక్‌క్రంచ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
వివరాలు
మెక్కిన్సే, ఓమ్నివిజన్ నిపుణులతో సంస్థ ఏర్పాటు
వృందా కపూర్ గతంలో హెల్త్‌కేర్ టెక్నాలజీ రంగంలో పనిచేశారు. ఆమె సౌత్ పార్క్ కామన్స్ ఫెలో కూడా. 2021 చివర్లో వినాయక్ దాల్మియాతో కలిసి భారత్ సెమీని స్థాపించారు.
సంస్థలో వినాయక్ దాల్మియా మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన గతంలో మెక్కిన్సే సంస్థతో పాటు ప్రైవేట్ ఈక్విటీ రంగంలో పనిచేశారు.
ఇక సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO) బోయిడ్ ఫౌలర్ గతంలో ఇమేజ్ సెన్సార్ల తయారీ సంస్థ ఓమ్నివిజన్‌లో ఇదే బాధ్యతలు నిర్వహించారు.
వివరాలు
స్మార్ట్ హోమ్స్ నుంచి ఏరోస్పేస్ వరకు..
స్మార్ట్ హోమ్స్, పారిశ్రామిక ఆటోమేషన్, నిఘా వ్యవస్థలు, ఏరోస్పేస్ రంగాలను భారత్ సెమీ లక్ష్యంగా చేసుకుంది.
తన సెన్సార్ల వినియోగానికి సంబంధించి వృందా కపూర్ కొన్ని ఉదాహరణలు వివరించారు.
గదిలో ఎవరూ లేనప్పుడు గుర్తించి ఆటోమేటిక్‌గా సెట్టింగులను మార్చుకునే ఎయిర్ కండిషనర్లు, ఖరీదైన కంప్యూటింగ్ హార్డ్‌వేర్ లేకుండానే విజువల్ సమాచారాన్ని విశ్లేషించగల డ్రోన్లు వంటి ఉత్పత్తుల్లో ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని తెలిపారు.
సంస్థ తొలి తరం సెన్సార్లు ప్రస్తుతం ప్రోటోటైప్ దశలో ఉన్నాయి. మరింత అధునాతన ఏఐ సామర్థ్యాలతో రూపొందిస్తున్న రెండో తరం సెన్సార్లు 2027 మధ్య నాటికి ప్రోటోటైప్ దశకు చేరుకుంటాయని వృందా కపూర్ వెల్లడించారు.
ఆ తర్వాత 2027 చివరి నాటికి వాటిని కస్టమర్లకు అందించాలని సంస్థ ప్రణాళిక రూపొందించింది.
వివరాలు
24 మిలియన్ డాలర్ల పెట్టుబడులు ఎక్కడి నుంచి?
భారత్ సెమీ సమీకరించిన 24 మిలియన్ డాలర్ల సీడ్ ఫండింగ్ పూర్తిగా ఈక్విటీ రూపంలో వచ్చింది.
ఇన్ఫో ఎడ్జ్ గ్రూప్, సౌత్ పార్క్ కామన్స్, ఇండస్ బ్రిడ్జ్ వెంచర్స్ సంయుక్తంగా ఈ పెట్టుబడులకు నాయకత్వం వహించాయి.
వీటితో పాటు వాలర్ క్యాపిటల్, మైక్రోమ్యాక్స్, గెయింగెల్స్, పలువురు వ్యక్తిగత పెట్టుబడిదారులు కూడా పాల్గొన్నారు.
ఈ నిధులను ఇంజినీరింగ్ బృందాన్ని విస్తరించేందుకు, ఉత్పత్తుల అభివృద్ధిని పూర్తి చేసేందుకు, ఇమేజ్ సెన్సార్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు వినియోగించనున్నట్లు వృందా కపూర్ తెలిపారు.
వివరాలు
అమెరికా, యూరప్‌లోనూ ఉద్యోగుల నియామకాలు
ప్రస్తుతం భారత్ సెమీకి భారత్, అమెరికాలో కలిపి సుమారు 75 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 10 నుంచి 12 మంది అమెరికా కార్యకలాపాల్లో పనిచేస్తున్నారు.
కాలిఫోర్నియాలోని శాంటా క్లారా కేంద్రంగా ఇంజినీరింగ్, వ్యాపార అభివృద్ధి విభాగాలు పనిచేస్తున్నాయి.
2027 మధ్య నాటికి అమెరికాలో ఉద్యోగుల సంఖ్యను సుమారు 20కి పెంచాలని సంస్థ భావిస్తోంది. మరోవైపు యూరప్‌లోనూ ఇంజినీర్ల నియామకాలను ప్రారంభించింది.
భారత్ నుంచి ఒక అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీని నిర్మించగలమా? అనేదే మా ముందున్న లక్ష్యం'' అని వృందా కపూర్ పేర్కొన్నారు.
వివరాలు
సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్రాజెక్టు వేరు
2024లో భారత్ సెమీ దేశంలో సెమీకండక్టర్ తయారీ కేంద్రం (Fabrication Facility) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ ప్రాజెక్టులో అమెరికా స్పేస్ ఫోర్స్‌తో సాంకేతిక భాగస్వామ్యం కూడా ఉందని వెల్లడించింది. అయితే ఈ ప్రాజెక్టు ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని వృందా కపూర్ తెలిపారు.
ఈ కేంద్రాన్ని నిర్మించి, నిర్వహించేందుకు అవసరమైన దేశీయ భాగస్వాములను గుర్తించే పనిలో సంస్థ ఉందన్నారు.
ఈ ఫ్యాబ్రికేషన్ ప్రాజెక్టుకు, ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న ఇమేజ్ సెన్సార్ వ్యాపారానికి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు.
భారత్ సెమీ ఫ్యాబ్‌లెస్ (Fabless) సంస్థగానే కొనసాగాలని నిర్ణయించుకుంది. అంటే చిప్‌ల రూపకల్పన, సాఫ్ట్‌వేర్ అభివృద్ధిపై దృష్టి సారిస్తూ.. వాటి తయారీని ఇతర సంస్థలకు అప్పగించనుంది.