
Artificial Intelligence: టెక్ దిగ్గజాలు AI ప్రమాదాలను తక్కువగా అంచనా వేస్తున్నాయి : ఏఐ పితామహుడు
ఈ వార్తాకథనం ఏంటి
టెక్నాలజీ దిగ్గజాలు కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - ఏఐ) వల్ల ఎదురయ్యే ముప్పును తక్కువగా అంచనా వేస్తున్నట్లు,ఈ రంగంలో మార్గదర్శకుడైన జెఫ్రీ హింటన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐను పరిగణనలోకి తీసుకొని పనిచేసే విధంగా టెక్ కంపెనీలు స్పందించకపోవడాన్నిఆయన తీవ్రమైన సమస్యగా అభివర్ణించారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. "కృత్రిమ మేధ వల్ల కలిగే ప్రమాదాలను పలువురు ప్రముఖ శాస్త్రవేత్తలు తక్కువ చేసి మాట్లాడుతున్నారు అనే అభిప్రాయం నాకు ఉంది. అయితే డీప్‌మైండ్ సీఈఓ డెమిస్ హస్సాబిస్ వంటి వ్యక్తులు మాత్రం ఈ ముప్పును సీరియస్‌గా తీసుకుంటూ,దానిని ఎదుర్కొనే మార్గాలు అన్వేషిస్తున్నారు.నా జీవితం తొలినాళ్లలో ఈ ప్రమాదాన్ని గుర్తించలేకపోవడంపై ఇప్పుడు విచారం కలుగుతోంది," అని హింటన్ పేర్కొన్నారు.
వివరాలు
ఏఐ ప్రమాదాలపై స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం
సుమారు దశాబ్దకాలం గూగుల్‌లో పనిచేసిన హింటన్, 2023లో ఆ సంస్థను విడిచారు. అప్పట్లో ఏఐను విస్తృతంగా ఉపయోగించేందుకు గూగుల్ చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఆయన కంపెనీని వదిలేశారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా హింటన్ వాటిని ఖండించారు. తన వయసు అప్పటికే 75 సంవత్సరాలైందని, శారీరకంగా ఇకపై ఆశించిన స్థాయిలో పనిచేయలేనన్న ఆలోచనతోనే గూగుల్ నుంచి నిష్క్రమించానని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు సంస్థల్లో పనిచేయకపోవడంతో, ఏఐ ప్రమాదాలపై స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం తనకు లభించిందని చెప్పారు.
వివరాలు
దుర్వినియోగమే అత్యంత ప్రమాదకరం
ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్‌వర్క్స్ రంగంలో చేసిన విశేష పరిశోధనలకుగాను జెఫ్రీ హింటన్‌కు 2024లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఆయన చేసిన అధ్యయనాలే నేటి ఏఐ విప్లవానికి బలమైన పునాది వేసినట్లయ్యాయి. ఇదే సందర్భంగా డీప్‌మైండ్ సీఈఓ డెమిస్ హస్సాబిస్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధ వల్ల ఉద్యోగ నష్టాలు తప్పకుండానే ఉంటాయి, వాటికంటే ఆ ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం ప్రమాదకరమని హెచ్చరించారు. దుష్ట ఉద్దేశాలు ఉన్నవారు ఏఐను వాడితే, తీరని వినాశకర పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అలాంటి వ్యక్తులకు ఈ టెక్నాలజీని అందుబాటులోకి రానీయకుండా నియంత్రణలు విధించాల్సిన అవసరముందని ఆయన సూచించారు.