Anthropic CEO: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల రూపురేఖలు మారనున్నాయి: ఏఐ-మనిషి 'సెంటార్' యుగం వచ్చేసింది
ఈ వార్తాకథనం ఏంటి
ఏఐ-మనిషి కలిసి పనిచేసే 'సెంటార్' యుగం సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల రూపును మార్చబోతోందని ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్ సహ వ్యవస్థాపకుడు,సీఈఓ డారియో అమోడై వ్యాఖ్యానించారు. రాస్ డౌథాట్ నిర్వహించే 'ఇంట్రెస్టింగ్ టైమ్స్' పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆయన, మనిషి-ఏఐ భాగస్వామ్యాన్ని సగం మనిషి, సగం గుర్రంగా ఉండే పురాణ జీవి 'సెంటార్'తో పోల్చారు. గత రెండు దశాబ్దాల్లో చెస్‌లో ఎలా మనిషి-కంప్యూటర్ కలిసి ఆడే దశ నుంచి పూర్తిగా ఏఐ ఆధిపత్యం వచ్చిందో, అదే తరహాలో ఇప్పుడు సాఫ్ట్‌వేర్ రంగంలో కూడా 'సెంటార్ దశ' నడుస్తోందన్నారు. ఇప్పటికే సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో మనిషి-ఏఐ కలిసి పనిచేసే స్థితికి వచ్చామని, ఈ దశ కొద్దికాలమే ఉన్నా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు డిమాండ్ మాత్రం పెరగవచ్చని చెప్పారు.
వివరాలు
ఐదేళ్లలోనే 50శాతం ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశం
అయితే మరోవైపు, ఏఐ కారణంగా ఎంట్రీ లెవల్ వైట్‌కాలర్ ఉద్యోగాల్లో భారీ మార్పులు,అవాంతరాలు తప్పవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత పారిశ్రామిక విప్లవాల కంటే చాలా వేగంగా ఈ మార్పులు జరుగుతున్నాయని,ఒకటి నుంచి ఐదేళ్లలోనే 50శాతం ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని అమోడై ముందే అంచనా వేశారు. ఇదే అభిప్రాయాన్నిఇతర ప్రముఖ ఏఐ ల్యాబ్ నేతలు ముస్తఫా సులేమాన్,డెమిస్ హసాబిస్ కూడా వ్యక్తం చేస్తూ,రాబోయే 18 నెలల్లో సేవారంగ ఉద్యోగాలను ఏఐ ఆటోమేట్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయితే కొందరు సాఫ్ట్‌వేర్ కంపెనీల అధినేతలు మాత్రం,ఏఐ ఇంజినీర్లను భర్తీ చేయదని,వారిని మరింత ఉత్పాదకులుగా మార్చి, కంపెనీలు ఇంకా ఎక్కువ మంది డెవలపర్లను నియమించే పరిస్థితి తెస్తుందని అంటున్నారు.