Page Loader
Airtel on SPAM: ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఉచితంగా రియల్ టైమ్ AI స్పామ్ డిటెక్షన్‌ సదుపాయం 
ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఉచితంగా రియల్ టైమ్ AI స్పామ్ డిటెక్షన్‌ సదుపాయం

Airtel on SPAM: ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఉచితంగా రియల్ టైమ్ AI స్పామ్ డిటెక్షన్‌ సదుపాయం 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 25, 2024
02:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

అవాంఛిత కాల్స్‌, సందేశాల సమస్యను ఎదుర్కొనేందుకు ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌ టెల్‌ (Airtel) కొత్త పరిష్కారాన్ని తీసుకువచ్చింది. టెలికాం యూజర్లను గత కొన్నేళ్లుగా వేధిస్తున్న ఈ సమస్యను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) సాయంతో అడ్డుకునేందుకు కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశామని కంపెనీ సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ గోపాల్‌ విత్తల్‌ తెలిపారు. సెప్టెంబర్ 26 నుండి ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని, స్పామ్‌ కాల్స్‌, సందేశాల విషయంలో యూజర్లకు ముందు గానే అలెర్ట్‌ చేస్తుందని వివరించారు. స్పామ్‌ కాల్స్‌పై చర్యలు తీసుకున్న మొదటి నెట్‌వర్క్‌ తమదేనని ఎయిర్‌టెల్‌ గర్వంగా పేర్కొంది.

వివరాలు 

2 మిల్లీ సెకన్లలో స్పామ్‌ను గుర్తించి యూజర్‌ను డైలర్‌లో అలెర్ట్‌

ప్రస్తుతం దేశంలో సగటుగా 60 శాతం మంది భారతీయులు రోజుకు మూడు స్పామ్‌ కాల్స్‌ అందుకుంటున్నారని, ఇవి టెలికాం యూజర్ల సమయాన్ని వృథా చేయడంతో పాటు కొన్ని సందర్భాల్లో స్కాములకు దారితీస్తున్నాయని ఎయిర్‌టెల్‌ తెలిపింది. వీటిని అడ్డుకొనే దిశగా ఎయిర్‌టెల్‌ ఈ ప్రయత్నం మొదలుపెట్టిందని గోపాల్‌ విత్తల్‌ తెలిపారు. ఎయిర్‌టెల్‌ ఏఐ ఆధారిత స్పామ్‌ డిటెక్షన్‌ సిస్టమ్‌ కేవలం 2 మిల్లీ సెకన్లలో స్పామ్‌ను గుర్తించి యూజర్‌ను డైలర్‌లో అలెర్ట్‌ చేస్తుందని పేర్కొన్నారు. ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ ఉపయోగించే అన్ని స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు ఈ సదుపాయాన్ని ఉచితంగా అందిస్తామని చెప్పారు.

వివరాలు 

వాట్సాప్ వంటి ఓటీటీ యాప్స్‌లో వచ్చే కాల్స్‌ను మాత్రం గుర్తించదు: గోపాల్‌ విత్తల్

తమ ఏఐ ఆధారిత పరిష్కారం ఒక రోజులో 150 కోట్ల సందేశాలను, 250 కోట్ల కాల్స్‌ను కేవలం 2 మిల్లీ సెకన్లలో ప్రాసెస్‌ చేయగలదని విత్తల్‌ వివరించారు. స్పామ్‌ అవకాశం ఉన్న సుమారు 100 మిలియన్‌ కాల్స్‌,3 మిలియన్‌ సందేశాలను గుర్తించగలదని పేర్కొన్నారు. అయితే, ఈ సిస్టమ్‌ యూజర్లకు అలెర్ట్‌ చేయడం తప్ప, ఆటోమేటిక్‌గా కాల్స్‌ లేదా సందేశాలను బ్లాక్‌ చేయదని, అలా చేయాలా వద్దా అన్నది యూజర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని గోపాల్‌ స్పష్టం చేశారు. నిజమైన కాల్స్‌ కూడా కొన్నిసార్లు స్పామ్‌గా గుర్తించబడే అవకాశమున్నందున ఈ నిర్ణయం యూజర్‌ చేతిలోనే ఉంటుందని చెప్పారు. వాట్సాప్ వంటి ఓటీటీ యాప్స్‌లో వచ్చే కాల్స్‌ను మాత్రం ఈ సిస్టమ్‌ గుర్తించదని ఆయన తెలిపారు.