LOADING...
Catastrophe: 2.8 రోజుల్లో విపత్తు? సౌర తుఫాన్లతో శాటిలైట్ వ్యవస్థ కూలిపోయే ప్రమాదం
2.8 రోజుల్లో విపత్తు? సౌర తుఫాన్లతో శాటిలైట్ వ్యవస్థ కూలిపోయే ప్రమాదం

Catastrophe: 2.8 రోజుల్లో విపత్తు? సౌర తుఫాన్లతో శాటిలైట్ వ్యవస్థ కూలిపోయే ప్రమాదం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 16, 2025
02:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారీ సౌర తుఫాన్ సంభవిస్తే, ప్రస్తుతం భూమి చుట్టూ ఉన్నశాటిలైట్ మెగా-కాన్స్టిలేషన్ వ్యవస్థ కొన్ని రోజుల్లోనే కూలిపోవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తాజాగా వెలువడిన ఒక పరిశోధనా డాక్యుమెంట్'లో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. లో ఎర్త్ ఆర్బిట్‌(భూమికి దగ్గరగా ఉండే కక్ష్య)ఇప్పటికే శాటిలైట్లతో బాగా నిండిపోయింది. గణాంకాల ప్రకారం, ప్రతి 22 సెకన్లకోసారి రెండు శాటిలైట్లు ఒక కిలోమీటర్ కన్నా తక్కువ దూరంలో ఒకదానికొకటి దగ్గరగా వెళ్లిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఢీకొనకుండా ఉండేందుకు భూమి నుంచి శాస్త్రవేత్తలు శాటిలైట్లను నిరంతరం నియంత్రిస్తున్నారు. ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నసారా థీల్‌తో పాటు ఆమె సహచరులు రాసిన ఈ డాక్యుమెంట్,సాధారణ పరిస్థితులు కాకుండా 'ఎడ్జ్ కేసులు'అని పిలిచే అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఏమి జరుగుతుందో విశ్లేషించింది.

వివరాలు 

శాటిలైట్లను మళ్లించే చర్యలు

ముఖ్యంగా సౌర తుఫాను వచ్చినప్పుడు పరిస్థితి ఎలా మారుతుందన్నదే వారి అధ్యయనం. 'యూనివర్స్ టుడే' కథనం ప్రకారం, సౌర తుఫాన్ల వల్ల శాటిలైట్లపై గాలితెగింపు (డ్రాగ్) పెరిగి అవి ఒకదానికొకటి ఢీకొనే మార్గంలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. దీన్ని నివారించేందుకు శాటిలైట్లను మళ్లించే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అసలు సమస్య ఏమిటంటే, సౌర తుఫాన్లు నావిగేషన్, కమ్యూనికేషన్ వ్యవస్థలపై కూడా ప్రభావం చూపుతాయి. ఇవే శాటిలైట్లను కదిలించడానికి అవసరమైన కీలక వ్యవస్థలు. ఒకవేళ ఇవి పనిచేయకపోతే, మనుషులు శాటిలైట్లపై నియంత్రణ కోల్పోతారు. అప్పుడు సౌర తుఫాను వల్ల వచ్చే డ్రాగ్ కారణంగా పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారి, వెంటనే పెద్ద విపత్తుకు దారి తీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

వివరాలు 

30శాతం మేరకు ప్రమాదం జరిగే అవకాశం

ఈ ప్రమాదాన్ని అంచనా వేసేందుకు పరిశోధకులు 'క్రాష్ క్లాక్' (Collision Realization and Significant Harm - CRASH) అనే కొత్త ప్రమాణాన్ని ఉపయోగించారు. శాటిలైట్లను తప్పించే ఆదేశాలు పంపలేని పరిస్థితి వస్తే,సుమారు 2.8 రోజుల్లోనే ఒక ఘోర ప్రమాదం జరిగే అవకాశం ఉందని అంచనా. ఈ అంచనా జూన్ 2025 నాటికి వర్తిస్తుందని తెలిపారు. 2018లో ఇదే ప్రమాదం ఏర్పడేందుకు 121 రోజులు పట్టేదని ,ఇప్పుడు పరిస్థితి ఎంత వేగంగా మారిందో ఇది చూపిస్తోంది. ఒకవేళ ఆపరేటర్లు కేవలం 24గంటలపాటు కూడా శాటిలైట్లపై నియంత్రణ కోల్పోతే, 30శాతం మేరకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని పరిశోధన చెబుతోంది.

Advertisement

వివరాలు 

 ప్రపంచ శాటిలైట్ మౌలిక వసతులే పూర్తిగా నాశనమయ్యే ప్రమాదం

ఇది 'కెస్లర్ సిండ్రోమ్' అనే భయంకర పరిస్థితికి దారి తీయవచ్చు. అంటే, కక్ష్య మొత్తం చెత్త మొక్కలతో నిండిపోయి, ఉన్న శాటిలైట్లు పనిచేయకపోవడం, కొత్త శాటిలైట్లను ప్రయోగించలేని పరిస్థితి రావడం తలెత్తింది. సౌర తుఫాను వచ్చినప్పుడు శాటిలైట్లను సురక్షితంగా ఉంచాలంటే వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ వ్యవస్థే పనిచేయకపోతే,సమస్యను సరిచేసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలా విఫలమైతే, మొత్తం శాటిలైట్ వ్యవస్థ 'పేక మేడలా' కూలిపోతుందన్నారు. 1859లో జరిగిన కారింగ్టన్ ఈవెంట్ లాంటి తీవ్రత కలిగిన సౌర తుఫాను మళ్లీ వస్తే, మూడురోజులకంటే ఎక్కువ కాలం శాటిలైట్లను నియంత్రించడం అసాధ్యమవుతుందని, చివరకు ప్రపంచ శాటిలైట్ మౌలిక వసతులే పూర్తిగా నాశనమయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు.

Advertisement