
ChatGPT: ప్రపంచ వ్యాప్తంగా చాట్‌జీపీటీ డౌన్.. చాట్‌బాట్‌లో ఎర్రర్ మెసేజ్‌లు
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధ (Artificial Intelligence) ఆధారంగా రూపొందించిన చాట్‌బాట్ 'చాట్‌జీపీటీ' సేవలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వినియోగదారులు ఈ సేవలను ఉపయోగించలేకపోతున్నట్లు తెలిసింది. చాలా మంది యూజర్లు సోషల్ మీడియా వేదికలపై సమస్యను వెలుగులోకి తెస్తూ, చాట్ హిస్టరీ లోడ్ కావడంలేదని, సందేశాలు పంపేందుకు ప్రయత్నిస్తే "అసాధారణ ఎర్రర్" అనే మెసేజ్ వస్తోందని ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ సాంకేతిక లోపం భారత్‌తో పాటు ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా దేశాలలోని వినియోగదారులను ప్రభావితం చేసినట్లు సమాచారం. డౌన్‌డిటెక్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం, సుమారు 82 శాతం మంది యూజర్లు చాట్‌జీపీటీ సేవలను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వివరాలు
ఈ నెలలో చాట్‌జీపీటీ సేవలు డౌన్ కావడం ఇది రెండోసారి
ఈ సమస్యపై చాట్‌జీపీటీ వెనుక ఉన్న ఓపెన్‌ఏఐ సంస్థ స్పందించింది. తమకు సమస్యను గుర్తించిన విషయం తెలిసిందేనని, దాన్ని తొందరగా పరిష్కరించేందుకు జట్టుగా కృషి చేస్తున్నామని పేర్కొంది. కేవలం చాట్‌జీపీటీ మాత్రమే కాకుండా, రికార్డ్ మోడ్,సోరా,కోడెక్స్ వంటి ఇతర ఓపెన్‌ఏఐ సేవలకూ అంతరాయం ఏర్పడినట్లు సంస్థ వెల్లడించింది. త్వరలోనే సమస్యను పరిష్కరించి సేవలను పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చింది. ఈ నెలలో చాట్‌జీపీటీ సేవలు డౌన్ కావడం ఇది రెండోసారి కావడం విశేషం. 2022లో పరిచయమైన చాట్‌జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పలు రకాల ప్రశ్నలకు తక్షణమే సమాధానాలు అందించే టూల్‌గా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. క్లిష్టమైన సమస్యలకూ క్షణాల్లో సమాధానం ఇవ్వగల ఈ టూల్‌ను విద్యార్థులు, వృత్తిపరులు సహా ఎన్నో విభాగాలవారు ఉపయోగిస్తున్నారు.
వివరాలు
టెక్నాలజీపై అతిగా ఆధారపడటం మంచిదికాదు: సామ్ ఆల్ట్‌మాన్
వినియోగదారుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని ఓపెన్‌ఏఐ సంస్థ చాట్‌జీపీటీకి అనేక కొత్త ఫీచర్లను నిరంతరం అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, వినియోగదారులను మరింత ఆకర్షిస్తోంది. అయితే, ఈ టెక్నాలజీపై అతిగా ఆధారపడటం మంచిదికాదని, చాట్‌జీపీటీకి రూపకర్తగానే కాకుండా ఓపెన్‌ఏఐ సంస్థ సీఈఓగా ఉన్న సామ్ ఆల్ట్‌మాన్ స్వయంగా హెచ్చరించారు. టెక్నాలజీని అనుకూలంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.