Loading...
Claude: ఇకపై మీ ఆర్థిక వ్యవహారాలనూ నిర్వహించనున్న క్లాడ్‌.. కొత్త ఫీచర్‌ వచ్చేసింది!
ఇకపై మీ ఆర్థిక వ్యవహారాలనూ నిర్వహించనున్న క్లాడ్‌..కొత్త ఫీచర్‌ వచ్చేసింది!

Claude: ఇకపై మీ ఆర్థిక వ్యవహారాలనూ నిర్వహించనున్న క్లాడ్‌.. కొత్త ఫీచర్‌ వచ్చేసింది!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2026
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో మరో కీలక అడుగు పడింది. ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ (Anthropic) తన చాట్‌బాట్ క్లాడ్‌ (Claude)లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 'పర్సనల్ ఫైనాన్స్' (Personal Finance) పేరుతో రూపొందించిన ఈ టూల్‌ ద్వారా వినియోగదారులు తమ ఆర్థిక వ్యవహారాలను మరింత మెరుగ్గా నిర్వహించుకోవచ్చు. ప్లాయిడ్‌ (Plaid) సంస్థతో అనుసంధానం చేసుకోవడం ద్వారా బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డు వివరాలను నేరుగా క్లాడ్‌కు లింక్ చేయొచ్చు. అనంతరం తమ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందవచ్చు. అయితే ఈ ఫీచర్‌ ద్వారా ఖాతాల వివరాలను మాత్రమే చూడగలరు. వినియోగదారుల తరఫున ఎలాంటి లావాదేవీలు చేయడం, పెట్టుబడులు పెట్టడం సాధ్యం కాదు.

వివరాలు 

వ్యక్తిగత ఆర్థిక సహాయకుడిగా క్లాడ్

వినియోగదారులకు వ్యక్తిగత ఆర్థిక సహాయకుడిగా పనిచేయడమే ఈ కొత్త ఫీచర్‌ ప్రధాన ఉద్దేశమని ఆంథ్రోపిక్‌ తెలిపింది.

సాధారణంగా ఏఐ చాట్‌బాట్లు ఇచ్చే ఆర్థిక సలహాలకు భిన్నంగా.. వినియోగదారుల ఖర్చులు, పొదుపు అలవాట్లు, డబ్బు నిర్వహణ తీరును అర్థం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.

బ్యాంకు ఖాతాల్లోని నిల్వలు, లావాదేవీల వివరాల నుంచి ఆర్థిక రంగానికి సంబంధించిన తెలియని పదాల వరకు సులభమైన భాషలో వివరిస్తుంది.

అంతేకాకుండా ఈ ఫీచర్‌లో ప్రకటనలు, స్పాన్సర్డ్‌ సిఫార్సులు ఉండవని సంస్థ స్పష్టం చేసింది.

వివరాలు 

చాట్‌జీపీటీ ఫైనాన్సెస్‌కు పోటీగా కొత్త ఫీచర్

క్లాడ్‌ను ఉపయోగించే వారిలో ఆర్థిక సలహాలు కోరేవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈ ఫీచర్‌ను రూపొందించినట్లు ఆంథ్రోపిక్‌ వెల్లడించింది.

ఓపెన్‌ఏఐ తీసుకొచ్చిన చాట్‌జీపీటీ ఫైనాన్సెస్‌ తరహాలోనే ప్లాయిడ్‌ ద్వారా అనుసంధానించిన బ్యాంకు ఖాతాల వివరాలను మాత్రమే చూసే అవకాశం కల్పించింది.

ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని వినియోగదారులు తమ ఖర్చుల అలవాట్లు, భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికల గురించి క్లాడ్‌ను ప్రశ్నించవచ్చు. వాటికి అనుగుణంగా సమాధానాలు పొందవచ్చు.

ADVERTISEMENT

వివరాలు 

వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి భద్రత

కొత్త ఫీచర్‌ ద్వారా ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తుంది? దాన్ని ఎలా ఉపయోగిస్తుంది? అనే విషయాలపై ఆంథ్రోపిక్‌ స్పష్టతనిచ్చింది.

అనుసంధానించిన బ్యాంకు ఖాతాలకు సంబంధించి బ్యాంకు పేరు, ఖాతా పేరు, ఖాతా రకం, ఖాతా నంబర్‌లోని చివరి నాలుగు అంకెలు, నిల్వలు, క్రెడిట్‌ పరిమితి వంటి వివరాలను క్లాడ్‌ చూడగలదు.

అంతేకాకుండా గరిష్ఠంగా రెండేళ్ల లావాదేవీల సమాచారాన్ని కూడా పరిశీలించగలదు.

అయితే పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగంలో జరిగే సంభాషణలను ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించబోమని సంస్థ వెల్లడించింది.

వ్యక్తిగత, సున్నితమైన ఆర్థిక సమాచారాన్ని ఏఐతో పంచుకోవడానికి ఆందోళన చెందేవారికి ఇది భరోసా కల్పించే అంశం.

ADVERTISEMENT

వివరాలు 

ఆర్థిక వివరాలను చార్టులు, గ్రాఫ్‌ల రూపంలో..

ఈ ఫీచర్‌లో మరో ప్రత్యేకత కూడా ఉంది. వినియోగదారుల ఆర్థిక సమాచారాన్ని కేవలం అంకెల రూపంలో కాకుండా పట్టికలు, చార్టుల రూపంలోనూ చూపిస్తుంది.

ఉదాహరణకు వారంలో ఎంత ఖర్చు చేశారో తెలిపే చార్ట్‌, రాబోయే చెల్లింపుల క్యాలెండర్‌, ముఖ్యమైన ఆర్థిక వివరాలతో కూడిన డ్యాష్‌బోర్డ్‌ రూపొందించమని క్లాడ్‌ను అడగవచ్చు.

అలా రూపొందించిన వాటిని ఆర్టిఫాక్ట్స్‌ రూపంలో అందిస్తుంది. వాటిని ఎప్పుడైనా తిరిగి పరిశీలించడంతో పాటు అవసరానికి అనుగుణంగా మార్పులు చేసుకోవచ్చు.

ఆర్థిక వివరాలను గ్రాఫ్‌లు, చిత్రాల రూపంలో అర్థం చేసుకోవాలనుకునేవారికి ఈ ఫీచర్‌ ఉపయోగకరంగా ఉంటుంది.

వివరాలు 

భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక సేవలు

పర్సనల్‌ ఫైనాన్స్‌ ఫీచర్‌ కేవలం తొలి అడుగు మాత్రమేనని ఆంథ్రోపిక్‌ పేర్కొంది.

ఆర్థిక విషయాల్లో క్లాడ్‌ చెప్పే ప్రతి సమాధానాన్ని పూర్తిగా నమ్మకూడదని వినియోగదారులకు సూచించింది.

భవిష్యత్తులో క్లాడ్‌లో మరింత సమగ్రమైన ఆర్థిక ప్రణాళిక వ్యవస్థను తీసుకొచ్చే దిశగా సంస్థ పరిశీలిస్తోంది.

ఇందులో భాగంగా బ్యాంకులు, సంపద నిర్వహణ సంస్థలు, ఇతర ఆర్థిక సేవల సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి.

తద్వారా భవిష్యత్తులో వినియోగదారులకు మరిన్ని ఆర్థిక సేవలను ఒకే వేదికపై అందించాలనేది ఆంథ్రోపిక్‌ ఆలోచన.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

క్లాడ్‌ చేసిన ట్వీట్ 

ADVERTISEMENT