Investment Scam: వాట్సాప్ లో వృద్ధుడికి వలవేసిన మోసగాళ్లు.. రూ.50 లక్షలు నష్టపోయిన బాధితుడు
హైదరాబాద్‌లోని 63 ఏళ్ల వృద్ధుడు భారీ మోసానికి గురయ్యారు. 'స్టాక్ డిస్కషన్ గ్రూప్' పేరుతో ఉన్న ఓ వాట్సాప్ గ్రూప్‌లో చేరి, మోసపూరిత స్కీంలో ఇరుక్కున్నాడు. ఈ గ్రూప్ నిర్వాహకుడు కునాల్ సింగ్ తనను ఒక అగ్రశ్రేణి ఆర్థిక సలహాదారుగా పరిచయం చేసుకొని, గతంలో అనేక కస్టమర్లకు ఆశాజనక రాబడులను సాధించారని నమ్మించాడు. సింగ్ వాట్సాప్ గ్రూప్‌లో పలు లింక్‌లు షేర్ చేసి, వాటిలోకి చేరి ఆన్‌లైన్ సెషన్‌లు నిర్వహిస్తానని తెలిపాడు. ఈ సెషన్‌ల్లో పెట్టుబడి వ్యూహాలు, స్టాక్ మార్కెట్‌లో లాభాలపై వివరాలు చెప్పడంతో ఆ వృద్ధుడు మరింత ఆసక్తిగా ఈ క్లాసుల్లో పాల్గొన్నారు.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి : సైబర్ క్రైమ్ పోలీసులు
సింగ్ 'స్కైరిమ్ క్యాపిటల్' పేరుతో ఒక పెట్టుబడి ప్లాట్‌ఫారమ్‌ను సురక్షితమైనది అని చెప్పి, అతని ద్వారా పెట్టుబడులు పెట్టమని ఉత్సాహపరిచాడు. మొదట్లో, చిన్న మొత్తాలు పెట్టి, లాభాలు వస్తున్నట్లు చూపించడంతో బాధితుడికి నమ్మకం పెరిగింది. ఆపై మరింత పెట్టుబడి పెడితే ఇంకా మంచి లాభాలు వస్తాయని చెప్పి మొత్తంగా రూ. 50 లక్షలు పెట్టించేశారు. చివరికి లాభాలు విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినపుడు, వెబ్‌సైట్ నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో బాధితుడు మోసపోయినట్లు గ్రహించి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.