Dinosaurs Extinction: డైనోసార్ల వినాశనంపై కొత్త మిస్టరీ...సూర్యుడే కారణమా?
ఈ వార్తాకథనం ఏంటి
సుమారు 6.6 కోట్ల ఏళ్ల క్రితం భూమిని ఓ భారీ అంతరిక్ష శిల ఢీకొట్టడంతో డైనోసార్లు అంతరించిపోయినట్లు ఇప్పటివరకు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఈ ఘటన వెనుక మరో కారణం ఉండొచ్చని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త రిచర్డ్ ముల్లర్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. సూర్యుడికి 'నెమెసిస్' అనే రహస్య జంట నక్షత్రం ఉండొచ్చని ఆయన చెబుతున్నారు. ఈ నక్షత్రం ప్రతి 2.6 కోట్ల ఏళ్లకోసారి సౌర కుటుంబం అంచుల దగ్గరగా ప్రయాణిస్తూ భారీగా తోకచుక్కలను భూమివైపు పంపి ఉండొచ్చన్నది ఈ సిద్ధాంతం.
Details
ప్రతి 2.6 కోట్ల ఏళ్లకోసారి తోకచుక్కల వర్షం?
ముల్లర్ సిద్ధాంతం ప్రకారం నెమెసిస్ ఒక రెడ్ డ్వార్ఫ్ నక్షత్రం. ఇది సూర్యుడితో కలిసి ఒకే గురుత్వ కేంద్రం చుట్టూ తిరుగుతుందని ఆయన అంచనా వేశారు.
ప్రతి 2.6 కోట్ల ఏళ్లకు ఒకసారి ఈ నక్షత్రం సౌర కుటుంబం చివర్లో ఉన్న ఓర్ట్ క్లౌడ్ దగ్గరకు చేరుతుందని భావిస్తున్నారు. అక్కడ లక్షల కోట్ల మంచు పదార్థాలు, తోకచుక్కలు ఉంటాయి.
నెమెసిస్ గురుత్వ ప్రభావం వాటిలో కొన్నింటిని కదిలిస్తే, భారీ సంఖ్యలో తోకచుక్కలు అంతర్గత సౌర వ్యవస్థ వైపు దూసుకురావచ్చని సిద్ధాంతం చెబుతోంది.
ఈ ప్రక్రియ దాదాపు 10 లక్షల ఏళ్ల వరకు కొనసాగొచ్చని అంచనా.
Details
డైనోసార్ల అంతరించిపోవడంతో సంబంధమేంటి?
1982లో జరిగిన ఓ అధ్యయనంలో సముద్ర జీవుల అంతరించిపోవడంలో దాదాపు 2.6 కోట్ల ఏళ్లకోసారి పునరావృతమయ్యే నమూనా కనిపించినట్లు గుర్తించారు.
ఇదే విషయాన్ని ఆధారంగా తీసుకుని ముల్లర్ నెమెసిస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. సుమారు 6.6 కోట్ల ఏళ్ల క్రితం ప్రస్తుత మెక్సికో ప్రాంతంలో భారీ అంతరిక్ష వస్తువు ఢీకొట్టింది.
దాని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా భారీ మార్పులు చోటుచేసుకుని డైనోసార్లు అంతరించిపోయారు.
ఆ వస్తువు గ్రహశకలమా, తోకచుక్కా అన్నది ఇప్పటికీ పూర్తిగా తేలలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే నెమెసిస్ సిద్ధాంతం చర్చకు వచ్చింది.
Details
నెమెసిస్ నిజంగా ఉందా? శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు
అయితే ఈ సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలందరూ అంగీకరించడం లేదు. 2014లో పెన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు నాసా వైజ్ ఇన్‌ఫ్రారెడ్ టెలిస్కోప్ డేటాను పరిశీలించారు.
సౌర కుటుంబం అంచుల్లో నెమెసిస్ లాంటి నక్షత్రం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదు. ఖగోళ శాస్త్రవేత్త కెవిన్ లుహ్మన్ కూడా అక్కడ పెద్ద గ్యాస్ గ్రహం లేదా చిన్న జంట నక్షత్రం ఉండే అవకాశం లేదని పేర్కొన్నారు.
అయినప్పటికీ ముల్లర్ తన సిద్ధాంతాన్ని పూర్తిగా వదులుకోలేదు. నెమెసిస్ చాలా దూరంగా, చాలా మసకగా ఉండటం వల్ల ఇప్పటికీ మన కంటికి చిక్కకుండా ఉండొచ్చని ఆయన భావిస్తున్నారు. ఈ సిద్ధాంతం నిజమో కాదో తేలాలంటే మరిన్ని ఆధారాలు అవసరం.