అగ్ని ప్రైమ్ గ్రాండ్ సక్సెస్.. ఒడిశా తీరం నుంచి పరీక్షించిన భారత్
బాలిస్టిక్ అగ్నిక్షిపణుల తరంలో కొత్తతరం మిస్సైల్ వచ్చి చేరింది. అగ్నిప్రైమ్ గా పిలుచుకునే ఈ బాలిస్టిక్ క్షిపణి రాత్రిళ్లు కూడా ప్రయాణం చేయగలదు. ఈ మేరకు ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ నూతన తరం అగ్నిప్రైమ్ క్షిపణిని బుధవారం రాత్రి ప్రయోగించారు. అయితే ఈ పరీక్ష గ్రాండ్ సక్సెస్ సాధించిందని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) వెల్లడించింది. భారత సాయుధ దళాలకు అగ్నిప్రైమ్ క్షిపణిని అప్పగించే ముందు శాంపిల్ గా రాత్రిపూట చేసిన తొలి ప్రయోగంగా దీన్ని గుర్తించారు. గతంలోనూ డే టైమ్ లో మూడు సాధారణ పరీక్షలు నిర్వహించామని, ప్రతిసారి పరీక్షలు విజయవంతమయ్యాయని డీఆర్డీఓ స్పష్టం చేసింది.
రాత్రుళ్లూ దూసుకెళ్లే అధునాతన మిస్సైల్ టెక్నాలజీ భారత్ సొంతం
తాజాగా రాత్రిపూటలో చేసిన ప్రయోగం ద్వారా ఈ క్షిపణి వేగం, కచ్చితత్వం, సమర్థత, విశ్వసనీయతలను లెక్కించారు. విభిన్న ఏరియాల్లోని టెలిమెట్రీ, రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. దీంతో రాత్రి వేళ అగ్నిప్రైమ్ ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలించారు. ఈ మేరకు 2 కౌంట్ డౌన్ రేంజ్ నౌకలు సైతం అగ్నిప్రైమ్ మార్గంపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరించాయి. దీంతో ప్రయోగం సఫలమైందని నిర్థారించుకున్న శాస్త్రవేత్తలు విషయాన్ని ప్రకటించారు. ఫలితంగా రాత్రుళ్లూ దూసుకెళ్లే అధునాతన మిస్సైల్ టెక్నాలజీని భారత్ అందిపుచ్చుకోగలిగింది. దీనిపై స్పందించిన భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం డీఆర్డీవో సైంటిస్టులకు, సిబ్బందితో సహా సాయుధ దళాలకు అభినందనలు తెలిపారు.