వాట్సాప్ లో ఎడిట్ ఫీచర్ ఆప్షన్.. మెసెజ్‌లో తప్పులని ఎడిట్ ఎలా చేయాలంటే!
వాట్సాప్ తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఇటీవలే పర్సనల్ చాట్ కు లాక్ ఆప్షన్ జత చేసిన వాట్సాప్.. తాజాగా 'ఎడిట్' ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది.ఇతరులకు పంపిన మెసేజ్ 15 నిమిషాల్లోపు ఎడిట్ చేయడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడనుంది. ఈ ఫీచర్ ను ప్రపంచ వ్యాప్తంగా యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. ఇక నుంచి ఏదైనా మెసేజ్ లో తప్పు దొర్లితే దాన్ని పూర్తిగా డిలీట్ చేయాల్సిన పని ఉండదు.తొలుత పంపిన మెసేజ్ ను సరి చేయడానికి ఎడిట్ బటన్ ఆప్షను ఉపయోగిస్తే సరిపోతుంది. ఈ వారంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ ఎడిట్ ఫీచర్ అందుబాటులోకి రానున్నట్లు వాట్సాప్ ధ్రువీకరించింది.
ఎడిట్ ఆప్షన్ యూజర్లకు ప్రయోజనం
వాట్సాప్ లో ఏదైనా మెసేజ్ పంపిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేస్తే కాపీ, ఫార్వర్డ్ వంటి ఆఫ్షన్లు మనకు ముందు నుంచి కనిపిస్తున్నాయి. ఇక నుంచి అదనంగా ఎడిట్ ఆప్షన్ కూడా వాట్సాప్ యూజర్లకు చూపించనుంది. దాన్ని క్లిక్ చేసి పంపిన మెసేజ్ లో తప్పులు, స్పెల్లింగ్ లు ఈజీగా సరిచేసుకొని అవకాశం ఉంటుంది. మెసేజ్ పంపిన 15 నిమిషాల్లోపు ఎడిట్ ఎన్నిసార్లయినా చేసుకోవచ్చని వాట్సాప్ సంస్థ తెలిపింది. యూజర్లు తప్పు మెసేజ్ లు పంపి.. ఇబ్బందులు పడేవారికి ఈ ఎడిట్ ఆప్షన్ రిలీఫ్ ఇవ్వనుంది.