Grok AI image: డీప్‌ఫేక్ వివాదంతో గ్రోక్ ఏఐపై పరిమితులు.. చెల్లింపు వినియోగదారులకే ఇమేజ్ ఎడిటింగ్
ఈ వార్తాకథనం ఏంటి
ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో గ్రోక్ ఏఐ ద్వారా చిత్రాలను ఎడిట్ చేసే సదుపాయాన్ని ఇకపై కేవలం చెల్లింపు సభ్యులకే పరిమితం చేశారు. లైంగిక భావాలు కలిగిన డీప్‌ఫేక్ చిత్రాలు తయారవుతున్నాయనే తీవ్ర విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇతరుల అనుమతి లేకుండానే వారి ఫొటోలను డిజిటల్‌గా మార్చి దుస్తులు తొలగించినట్లుగా చూపించాలన్న వినియోగదారుల అభ్యర్థనలను గ్రోక్ ఏఐ అంగీకరించడంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో, పౌర సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.
వివరాలు
ఆందోళనలపై ప్రభుత్వం నియంత్రణ సంస్థ ఆఫ్‌కామ్ చర్యలు తీసుకోవాలి
ఈ సేవలు కేవలం చెల్లింపు సభ్యులకే అందుబాటులో ఉంటాయని.. ఇప్పుడు ఇలాంటి అభ్యర్థనలు చేసే వారికి గ్రోక్ స్పష్టంగా చెబుతోంది. అంటే, వారి పేరు, చెల్లింపు వివరాలు తప్పనిసరిగా నమోదు అయి ఉండాలి. ఈ అంశంపై స్పందన కోరుతూ బీబీసీ 'ఎక్స్' సంస్థను సంప్రదించింది. ఇదిలా ఉండగా, ఎక్స్ వేదికపై అక్రమంగా ఏఐ చిత్రాలు తయారవుతున్నాయన్న ఆందోళనలపై ప్రభుత్వం నియంత్రణ సంస్థ ఆఫ్‌కామ్ (Ofcom) తనకు ఉన్న అన్ని అధికారాలను ఉపయోగించాలని కోరింది. అవసరమైతే పూర్తిస్థాయి నిషేధం విధించే వరకు చర్యలు తీసుకోవాలన్న సూచనలు చేసింది.
వివరాలు
ఆఫ్‌కామ్‌కు ప్రభుత్వం పూర్తి మద్దతు
గ్రోక్ ద్వారా పెద్దలతో పాటు పిల్లలకు సంబంధించిన లైంగిక చిత్రాలు కూడా రూపొందుతున్నాయన్న ఆరోపణలపై బ్రిటన్ ప్రధాని సర్ కియర్ స్టార్మర్ స్పందించారు. ఈ విషయం "అత్యంత అవమానకరం, అసహ్యకరం" అంటూ ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటి కంటెంట్‌పై చర్యలు తీసుకోవడంలో ఆఫ్‌కామ్‌కు ప్రభుత్వ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. "ఇది చట్టవిరుద్ధం. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోము. అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను పరిశీలించాలని ఆదేశించాను," అని గ్రేటెస్ట్ హిట్స్ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టార్మర్ చెప్పారు.
వివరాలు
ఎలాన్ మస్క్‌కి చెందిన ఈ వేదికకు నిధులు సమకూర్చడాన్నిఅడ్డుకుంటాం
ప్రభుత్వ వర్గాలు బీబీసీ న్యూస్‌కు తెలిపిన వివరాల ప్రకారం, "గ్రోక్,ఎక్స్ విషయంలో ఆఫ్‌కామ్‌కు ఉన్న అన్ని అధికారాలను వినియోగిస్తుందని మేము ఆశిస్తున్నాం." ఆన్‌లైన్ సేఫ్టీ యాక్ట్ కింద ఆఫ్‌కామ్‌కు ఉన్న అధికారాల్లో భాగంగా, ఎలాన్ మస్క్‌కి చెందిన ఈ వేదికకు నిధులు సమకూర్చడాన్ని అడ్డుకునేలా లేదా యూకేలో యాక్సెస్‌ను నిలిపివేసేలా కోర్టును ఆశ్రయించే అవకాశం కూడా ఉంది. ఈ అంశంపై స్పందన కోరుతూ బీబీసీ ఆఫ్‌కామ్‌ను కూడా సంప్రదించింది.