
Starship: టెక్సాస్‌లో స్పేస్-X స్టార్‌షిప్ ప్రయోగం మరోసారి వాయిదా
ఈ వార్తాకథనం ఏంటి
ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్-X సంస్థ భారీ రాకెట్ స్టార్‌షిప్ ప్రయోగాన్ని మరోసారి వాయిదా వేసింది. రెండు రోజుల్లో ఇది రెండోసారి నిలిపివేయబడిన ప్రయోగం కావడం గమనార్హం. ఆదివారం సాయంత్రం లిక్విడ్ ఆక్సిజన్ లీక్ కారణంగా ప్రయోగం రద్దయితే,సోమవారం సాయంత్రం మాత్రం వాతావరణ సమస్యల కారణంగా నిలిపివేయాల్సి వచ్చింది. సూపర్ హెవీ బూస్టర్‌పై అమర్చిన స్టార్‌షిప్ ఎత్తు 397అడుగులు (121 మీటర్లు) ఉండి,స్టాట్యూ అఫ్ లిబర్టీ విగ్రహం కంటే కూడా ఎత్తుగా ఉంటుంది. చంద్రుడు, మంగళ గ్రహాల వరకు మనుషులను తీసుకెళ్లగలిగే పునర్వినియోగ రాకెట్లు తయారుచేయాలన్న ఎలాన్ మస్క్ కలల ప్రాజెక్ట్‌లో ఇది కీలకం. టెక్సాస్‌లోని స్టార్‌బేస్ కేంద్రం నుంచి రాత్రి 7.30 గంటలకు(0030 GMT)ఇది తన 10వ టెస్ట్‌ఫ్లైట్‌గా ఎగరాల్సి ఉంది.
వివరాలు
ఎందుకు రద్దు చేశారు?
"ఈరోజు వాతావరణ కారణంగా టెస్ట్ ఫ్లైట్ నిలిపివేయబడింది" అని స్పేస్-X "ఎక్స్" ప్లాట్‌ఫారమ్‌లో ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే, తదుపరి అనువైన సమయాన్ని గుర్తించేందుకు స్టార్‌షిప్ టీమ్ ప్రయత్నిస్తోందని కూడా వెల్లడించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
స్పేస్-X చేసిన ట్వీట్
Standing down from today’s flight test attempt due to weather. Starship team is determining the next best available opportunity to fly
— SpaceX (@SpaceX) August 26, 2025
వివరాలు
వరుస వైఫల్యాలు
ఈ ప్రయోగం వాయిదా, స్టార్‌షిప్ ప్రాజెక్ట్‌లో వస్తున్న వరుస సమస్యల్లో మరోటి మాత్రమే. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్ట్‌ఫ్లైట్‌లలో రాకెట్ అప్‌పర్ స్టేజ్ పేలిపోయింది. రెండు సార్లు కరేబియన్ దీవులపై అవశేషాలు పడగా, మరోసారి అంతరిక్షంలోకి వెళ్లాక ముక్కలైంది. జూన్‌లో జరిగిన ఒక స్టాటిక్ ఫైర్ టెస్ట్లో నేలమీదే పేలిపోయింది. ఇప్పటి వరకు ఒక పేలోడ్‌ని కక్ష్యలోకి పంపడంలో లేదా అప్‌పర్ స్టేజ్‌ను సజావుగా తిరిగి తీసుకురావడంలో స్టార్‌షిప్ విజయవంతం కాలేదు. అయినా ఎలాన్ మస్క్ మాత్రం ఆత్మవిశ్వాసంతోనే ఉన్నారు. ఆదివారం ఒక యూజర్‌కు రిప్లై ఇస్తూ, "ఇంకా 6-7 ఏళ్లలో స్టార్‌షిప్ రోజులో 24 గంటల్లో 24 సార్లు ఎగురుతుంది" అని ధైర్యంగా చెప్పారు.
వివరాలు
మానవజాతి కలల రాకెట్ - స్టార్‌షిప్
ఎలాన్ మస్క్ భవిష్యత్ మొత్తాన్ని ఈ పూర్తిగా పునర్వినియోగ రాకెట్‌పైనే పెట్టుబడిగా పెట్టారని AFP పేర్కొంది. ఇప్పటికే స్పేస్-ఎక్స్ ప్రధాన ఫాల్కన్ రాకెట్లను క్రమంగా తొలగించి, భవిష్యత్తు ప్రయోగాలన్నీ స్టార్‌షిప్ ద్వారానే జరపాలనే ఆలోచనలో ఉంది. నాసా కూడా 2027లో జరగనున్న మానవ సహిత లూనార్ మిషన్ కోసం స్టార్‌షిప్‌ను ఎంచుకుంది. ప్రయోగాలు విఫలమైనా, "తప్పిదాల నుంచే నేర్చుకోవాలి" అన్న విధానంతో స్పేస్-X వరుసగా టెస్ట్‌లు కొనసాగిస్తోంది. ముఖ్యంగా రాకెట్ దిగువ భాగాన్ని "చాపిస్టిక్" లాంచ్ టవర్ ఆర్మ్స్‌తో మూడు సార్లు విజయవంతంగా పట్టుకోవడంలో సక్సెస్ అయింది.
వివరాలు
పెరుగుతున్న విమర్శలు
అయితే, వరుస సమస్యలతో మస్క్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. "ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు జరిగాయి కానీ విజయాలు వైఫల్యాలను మించలేకపోయాయి. ఈ మిషన్‌పై భారీ ఒత్తిడి ఉంది" అని స్పేస్ విశ్లేషకుడు డల్లాస్ కసాబోస్కీ అన్నారు. మరో విశ్లేషకుడు విల్ లాకెట్ అయితే, స్టార్‌షిప్ కాన్సెప్ట్ పూర్తిగా లోపభూయిష్టమై ఉండొచ్చని విమర్శించారు.