X Premium: ఎక్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరలు 35% పెంపు..!
సామాజిక మాధ్యమం ఎక్స్ (X Premium)తన ప్రీమియం ప్లస్ ప్లాన్ల ధరలను భారత్ సహా ఇతర దేశాలలో పెంచినట్లు మైక్రోబ్లాగింగ్ వేదిక ప్రకటించింది. ఈ ప్రీమియం ప్లస్ ప్లాన్ ద్వారా ఎక్స్ వినియోగదారులకు అత్యుత్తమ స్థాయి సేవలు అందిస్తుందనీ వేదిక తెలిపింది. అమెరికాలో ఈ ధరలను 40 శాతం వరకూ పెంచినట్లు సమాచారం. ఈ నిర్ణయానికి బలమైన కారణాలు ఉన్నాయని ఎక్స్ ప్రకటించింది, ఇందులో వినియోగదారులు యాడ్‌ఫ్రీ కంటెంట్‌ను పొందవచ్చని తెలిపింది. 2025 జనవరి 21నుండి ముందే బిల్లింగ్ సైకిల్ ప్రారంభించిన వారు ప్రస్తుత ధరలను కొనసాగిస్తారు. కానీ,వారు తమ మొదటి బిల్లింగ్ సైకిల్ నుండి కొత్త ధరలను చెల్లించాల్సి ఉంటుంది.ధరలు వివిధ ప్రాంతాలు, పన్నులు,చెల్లింపు విధానాలను బట్టి మారవచ్చని ఎక్స్ వివరించింది.
కెనడా, నైజీరియా, తుర్కీ వంటి దేశాల్లో ధరల పెంపు
అమెరికాలో ఎక్స్ ప్రీమియం ప్లాన్ గతంలో నెలకు 16 డాలర్లు (సుమారు ₹1,360), ఏటా 168 డాలర్లు (సుమారు ₹14,000)గా ఉండగా, ఇప్పుడు ఈ ధరలు 22 డాలర్లు (₹1,900) నెలకు, 229 డాలర్లు (₹19,000) ఏటా పెరిగాయి. భారత్‌లో కూడా నెలకు ₹1,300, ఏటా ₹13,600ని వసూలు చేస్తుండగా, ఇప్పుడు ఇది నెలకు ₹1,750, ఏటా ₹18,300గా పెంచబడింది. ఈ ధరల పెంపు కెనడా, నైజీరియా, తుర్కీ వంటి దేశాల్లో కూడా అమలులో ఉంటుంది.
ప్రీమియం చందా సభ్యులకు యాడ్‌ఫ్రీ కంటెంట్
ఈ ప్రీమియం చందా సభ్యులకు యాడ్‌ఫ్రీ కంటెంట్ అందించడమే కాకుండా, గ్రోక్ ఏఐ మోడల్ యాక్సెస్, సపోర్టులో అధిక ప్రాధాన్యత కూడా ఇచ్చేలా ఎక్స్ ప్రకటించింది. మస్క్, తన మైక్రోబ్లాగింగ్ వేదిక ద్వారా, కీవర్డ్స్‌ను మానిటర్ చేయడానికి "రాడార్" అనే ప్రత్యేక టూల్‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంచే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు.