Eric Schmidt:ఏఐ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్‌ల సంస్కృతి పెరగడంపై గూగుల్ మాజీ సీఈవోఆందోళన
ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం వేగంగా విస్తరిస్తోంది. ప్రత్యేకంగా ఒంటరిగా ఉండే వ్యక్తుల కోసం రూపొందించిన ఏఐ గర్ల్‌ఫ్రెండ్, బాయ్‌ఫ్రెండ్ చాట్‌బాట్‌లు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఏఐ ఆధారిత గర్ల్‌ఫ్రెండ్, బాయ్‌ఫ్రెండ్ కల్చర్ విస్తరిస్తున్నదానికి గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ స్మిత్ ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన ఒక పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ, ఏఐ చాట్‌బాట్‌లతో మానసికంగా బలమైన సంబంధం ఏర్పడుతున్న వ్యక్తులు తీవ్ర ఒంటరితనంలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
సోషల్ మీడియా ఆల్గారిథమ్‌ల కారణంగా అతిగా ఆకర్షితులవుతున్నారు: ఎరిక్ స్మిత్
"ఏఐతో మాట్లాడటంతో పాటు భావోద్వేగాలు పంచుకునేలా అనేక మంది కనెక్ట్ అవుతున్నారు. ఏఐ మనస్సును ప్రభావితం చేయడమే కాకుండా, ఆలోచన విధానాన్ని కూడా మార్చేస్తుంది. ఆనందం కోసం ఆన్‌లైన్ ప్రపంచాన్ని ఆశ్రయించిన వారు, సోషల్ మీడియా ఆల్గారిథమ్‌ల కారణంగా అతిగా ఆకర్షితులవుతున్నారు. ఇది ప్రత్యేకించి చిన్నారులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 12-13 సంవత్సరాల పిల్లలు ఈ విషయాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఆన్‌లైన్ వేదికలపై వయసు పరిమితులు ఉన్నప్పటికీ, కొంతమంది టీనేజర్లు హానికరమైన కంటెంట్‌ను సులభంగా యాక్సెస్ చేస్తున్నారు," అని ఆయన అభిప్రాయపడ్డారు.
అమెరికాలోని సెక్షన్ 230 వంటి చట్టాలపై చర్చ
అదే విధంగా, అమెరికాలోని సెక్షన్ 230 వంటి చట్టాలను గురించి కూడా ఎరిక్ స్మిత్ చర్చించారు. ట్రంప్ పరిపాలన కాలంలో ఇతర ప్రధాన అంశాలకు ప్రాధాన్యత ఉంటే, ఏఐ నియంత్రణకు అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.