
Shubhanshu shukla: ఆహారం నుండి మానసిక ఆరోగ్యం వరకు.. ఐఎస్‌ఎస్ నుంచి విద్యార్థులతో ముచ్చటించిన శుభాంశు
ఈ వార్తాకథనం ఏంటి
అంతరిక్ష యాత్రలంటే అందరికీ ఆసక్తే. అయితే చిన్నపిల్లలైతే ఇంకెంతో ఉత్సాహంగా, ఆశ్చర్యంగా చూస్తారు. వ్యోమగాములు ఎలాంటి ఆహారం తింటారు? గురుత్వాకర్షణ లేని వాతావరణంలో వారు ఎలా నిద్రిస్తారు? వాళ్లలో ఎవరైనా అనారోగ్యానికి లోనైతే పరిస్థితి ఎలా ఉంటుంది? అంతరిక్షంలోకి ప్రవేశించిన తర్వాత ఏమనిపిస్తుంది?.. ఇలాంటి అనేక ప్రశ్నలు వారి మనసులను తొలిచేస్తుంటాయి. ఇలాంటి ఉత్సుకతలకు అంతరిక్ష కేంద్రం నుంచే భారత వ్యోమగామి శుభాంశు శుక్లా నేరుగా సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో ఉంటున్న ఆయన, ఇటీవల అంతరిక్ష యాత్ర చేశాడు. ఇస్రో చేపట్టిన "విద్యార్థులతో మాటామంతీ" అనే కార్యక్రమంలో భాగంగా గురువారం లఖ్‌నవూ, తిరువనంతపురంకి చెందిన కొంతమంది విద్యార్థులు శుక్లాతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడే అవకాశాన్ని పొందారు.
వివరాలు
శుక్లా ఆసక్తికర సమాధానం
అంతరిక్షంలో మీరెలా నిద్రిస్తారని ఓ విద్యార్థి ప్రశ్నించాడు. దీనికి శుక్లా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. "నిజానికి అది చాలా వినోదంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ నేల, పైకప్పు అనే భేదాలు ఉండవు. మీరు ఐఎస్‌ఎస్ లోపలికి వస్తే, ఒకరు గోడపై, మరొకరు పైకప్పుకు అతుక్కుని నిద్రపోతుండటం చూస్తారు. అక్కడ గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల ఎవరైనా తేలిపోతారు. కాబట్టి మనల్ని మనం సీలింగుకు కట్టేసుకోవచ్చు. ఆ క్రమంలోనే స్లీపింగ్ బ్యాగ్‌లలో మమ్మల్ని కట్టేసుకుని నిద్రిస్తాం. మా స్థానం మారిపోకుండా చూసుకోవడమే అసలైన సవాల్" అని శుక్లా ఆసక్తికరంగా చెప్పారు.
వివరాలు
తీరిక కుదరదు
అనారోగ్యం తలెత్తితే కోలుకునేందుకు తాము ముందే ఔషధాలను తీసుకెళ్లతామని, ఎవరికైనా అనారోగ్యం కలిగితే చికిత్స అందించే ఏర్పాట్లు ఉంటాయని. ఖాళీ సమయం దాదాపుగా దొరకదని, దొరికినప్పుడు మాత్రం ఆటలాడుతుంటామని అన్నారు. అంతరిక్షం నుండి భూమిని చూస్తే కలలాంటి అనుభూతి కలుగుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ అటువైపు ఆసక్తిగా చూస్తారని చెప్పారు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడం మన శరీరానికి పెద్ద సవాలుగా మారుతుందని శుక్లా తెలిపారు. అయితే, ఐఎస్‌ఎస్‌కు చేరిన మొదటి రోజుతో పోలిస్తే ఇప్పుడు తన పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని చెప్పారు "భూమికి తిరిగి వచ్చే సమయంలో మాత్రం మన శరీరం మళ్లీ గురుత్వాకర్షణను అంగీకరించాలంటే ఎంతో ముందస్తు సిద్ధత అవసరం అవుతుంది," అని వివరించారు.
వివరాలు
ఆహారంలో శ్రద్ధ - పోషకాల ప్రాముఖ్యత
"మేము తీసుకెళ్లే ఆహారం ముందుగానే ప్యాకింగ్ చేసినదే. వాటిలో అవసరమైన పోషక విలువలు ఉండేలా చూసుకుంటారు. మాకు ఉత్సాహాన్ని ఇచ్చేది ఆహారమే. అందుకే మేము ఇష్టపడే ఆహారాలు ఉండేలా ఎంచుకుంటాం." అనేక రకాల ఆహారాల ఎంపిక తమకు అందుబాటులో ఉంటుందన్న విషయం తెలియజేశారు.
వివరాలు
భూమిపై బరువు - అంతరిక్షంలో వ్యాయామం
భూమిపై ఉంటే గురుత్వాకర్షణ కారణంగా మన శరీరంపై బరువు ఉంటుంది, కాబట్టి నిలబడినా, నడిచినా, కూర్చున్నా కండరాలు పనిచేస్తాయని చెప్పారు. కానీ అంతరిక్షంలో అలా కుదరదు. అందుకే కండరాల్లో సమస్యలు రాకుండా ప్రత్యేకంగా వ్యాయామం చేయాల్సి వస్తుందన్నారు. వారి వద్ద ఉన్న సైకిల్, వ్యాయామ పరికరాల ద్వారా ప్రతి రోజు ఎక్సర్‌సైజ్ చేస్తామని వివరించారు. తాను దాన్ని వీడియోలో చూపించి వివరించారు. అంతరిక్షంలో ఎలా కదలుతారు? బంతితో ఎలా ఆడతారు? వంటి ఆసక్తికర విషయాలను ప్రత్యక్షంగా చూపించారు. ఇది చూసిన విద్యార్థులు ఆనందంతో ఉప్పొంగిపోయారు.