
ISRO Chairman: గగనయాన్ నుంచి LUPEX వరకు.. భారత అంతరిక్షం భవిష్యత్ ప్రణాళికను బయటపెట్టిన ఇస్రో ఛైర్మన్
ఈ వార్తాకథనం ఏంటి
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సరికొత్త లక్ష్యాలతో, వ్యాపార అవకాశాల దిశగా దూసుకుపోతోంది. దేశీయంగా సేవలను అందించడమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే ఉద్దేశ్యంతో వ్యూహాత్మక ప్రణాళికలు రచిస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఇస్రో తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించేందుకు నిర్ణయించుకుంది. ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇస్రో సేవల పరంగా పరిమితమవకుండా వ్యాపార అవకాశాల దిశగా దృష్టిపెట్టి, స్వంత అంతరిక్ష కేంద్ర నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. అంతరిక్ష రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం ప్రయత్నాలు సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
Details
2035 నాటికి స్వంత అంతరిక్ష కేంద్రం
భారతదేశం 2035 నాటికి తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తొలి మాడ్యూల్‌ను 2028 నాటికే కక్ష్యలోకి పంపించే ప్రయత్నంలో ఉందని నారాయణన్ చెప్పారు. ప్రస్తుతం భారత్‌కు ఉన్న ఉపగ్రహాల సంఖ్య 55 కాగా, ఈ సంఖ్య భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తక్కువేనని తెలిపారు. కనీసం మూడేళ్లలో 150 ఉపగ్రహాలు కావాలని అన్నారు. 2040 నాటికి అంతరిక్ష రంగంలో భారత్ ఏ దేశానికైనా గట్టి పోటీనివ్వగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో ఇస్రో మొత్తం 518 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. ఇది సంస్థ పరిజ్ఞాన సామర్థ్యాన్ని వెల్లడించే ఉదాహరణగా నిలుస్తోంది.
Details
మెజర్ మిషన్లు - 2024
ఇస్రో ఈ ఏడాదిలో 12 ప్రయోగ వాహన (లాంచ్ వెహికల్) మిషన్లను చేపట్టనున్నట్టు తెలిపింది. వాటిలో కొన్ని ముఖ్యమైనవి NISAR మిషన్ (NASA-ISRO): జూలై 30న GSLV F16 ద్వారా నాసా-ఇస్రో సంయుక్తంగా NISAR ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. అమెరికా కోసం కమ్యూనికేషన్ ఉపగ్రహం: మూడు నెలల్లో 6,500 కిలోల బరువుగల కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భారతీయ ప్రయోగ వాహనంతో అమెరికాకు ప్రయోగించనున్నారు. తృతీయ ప్రయోగ వేదిక (Launch Pad): శ్రీహరికోటలో మూడవ లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి కేంద్రం రూ.4,000 కోట్లు కేటాయించింది.
Details
గగనయాన్, జాపాన్‌తో సంయుక్త మిషన్‌లు
ఇస్రో గగనయాన్ మిషన్ ప్రణాళికలపై కూడా దృష్టి సారిస్తోంది. 2027 మొదటి త్రైమాసికంలో ఈ మిషన్‌ను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే చంద్రయాన్-3 విజయంతో భారత్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఇస్రో-జాక్సా (JAXA - జపాన్ స్పేస్ ఏజెన్సీ) సంయుక్తంగా LUPEX (Chandrayaan-5)మిషన్‌పై పనిచేస్తున్నాయి. ఉపగ్రహాన్ని భారత్-జపాన్ కలిసి అభివృద్ధి చేస్తున్నా, లాంచ్ జపాన్ నిర్వహిస్తుంది. గత ల్యాండర్ బరువు 1,600 కిలోలు కాగా, ఈసారి దాదాపు 6,600 కిలోల మిషన్‌ను పంపేందుకు సిద్ధమవుతున్నారు. రాబోయే రెండేళ్లలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని కీలక అప్‌డేట్స్ వస్తాయని నారాయణన్ తెలిపారు. సామగ్రిగా చూస్తే, ఇస్రో ప్రయోగాలు, మిషన్లు, అంతర్జాతీయ సహకారంతో భారత్ అంతరిక్షరంగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు వేగంగా దూసుకుపోతోంది.