ISRO: అంతరిక్షంలో మొలకల నుంచి ఆకుల దాకా.. ఇస్రో సైన్సులో సరికొత్త అధ్యాయం
ఈ వార్తాకథనం ఏంటి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రోదసిలో చేపట్టిన కీలక ప్రయోగంలో అలసంద విత్తనాల నుంచి తొలిసారిగా లేలేత ఆకులు పుట్టుకొచ్చాయి.
ఇటీవల ఈ విత్తనాలు మొలకెత్తగా, ఇప్పుడు ఆకులు రావడం అంతరిక్ష పరిశోధనలో గణనీయమైన ముందడుగుగా చెప్పొచ్చు.
ఈ ఫలితం రోదసిలో మొక్కల సాగు సాధ్యమని నిరూపిస్తోందని ఇస్రో ప్రకటించింది.
'క్రాప్' (కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్) పేరిట చేపట్టిన ఈ ప్రయోగం అంతరిక్షంలో ఆహారం పండించేందుకు అవసరమైన పద్ధతులపై పరిశోధనకు కీలకమైంది.
దీన్ని గత నెల 30న ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ-సి60 రాకెట్‌లోని నాలుగో దశలో (పోయెమ్) అమర్చారు.
Details
'క్రాప్' ప్రయోగం విజయవంతం
నియంత్రిత వాతావరణంలో నిర్వహిస్తున్న ఈ ప్రయోగం ద్వారా సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో మొక్కలు ఎలా అనుసంధానమవుతాయనే విషయాన్ని అధ్యయనం చేస్తున్నారు.
ఇస్రో ప్రకారం, ఈ పరిశోధన వ్యోమగాములకు జీవనాధార వ్యవస్థల రూపకల్పనలో కీలకంగా ఉపయోగపడనుంది.
ఈ విధానాల ద్వారా రోదసిలో ఆహారాన్ని పండించడమే కాకుండా గాలి, నీటి వనరులను సైతం సమకూర్చవచ్చని పేర్కొంది.
'క్రాప్' ప్రయోగం విజయవంతం కావడంతో రోదసిలో మానవులను సుదీర్ఘకాలం ఉంచే లక్ష్యానికి దగ్గరయ్యామని ఇస్రో స్పష్టం చేసింది.
ఇది రోదసిలో పరిశోధనల పరంగా మరో కీలక ఘట్టంగా నిలుస్తుందని, భవిష్యత్తులో అంతరిక్షంలో ఆహార వనరుల ఉత్పత్తి చేయడంలో ఈ ప్రయోగం మార్గదర్శకంగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.