Loading...
Gaganyaan mission delay: గగన్‌యాన్‌కు మరోసారి బ్రేక్‌.. 2027 ఫిబ్రవరి వరకు వాయిదా!
గగన్‌యాన్‌కు మరోసారి బ్రేక్‌.. 2027 ఫిబ్రవరి వరకు వాయిదా!

Gaganyaan mission delay: గగన్‌యాన్‌కు మరోసారి బ్రేక్‌.. 2027 ఫిబ్రవరి వరకు వాయిదా!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2026
05:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ మిషన్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించేందుకు ఉద్దేశించిన ఈ మానవ సహిత అంతరిక్ష యాత్రలో భాగంగా చేపట్టాల్సిన తొలి మానవరహిత ప్రయోగం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రయోగం 2027 ఫిబ్రవరి కంటే ముందుగా జరిగే అవకాశం లేదని ఇస్రోకు చెందిన పలువురు సీనియర్ అధికారులు వెల్లడించినట్లు సమాచారం. వాస్తవానికి 2026 డిసెంబర్‌లోనే ఈ ప్రయోగాన్ని నిర్వహించాలని ఇస్రో తొలుత లక్ష్యంగా పెట్టుకుంది. అయితే సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత మెరుగుపరచడం, అదనపు సిమ్యులేషన్లు నిర్వహించడం, వివిధ వ్యవస్థలను క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి రావడంతో ప్రయోగ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

వివరాలు 

80 శాతం పనులు పూర్తి.. భద్రతకే తొలి ప్రాధాన్యం

గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (HSFC),యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (URSC)ల్లో పనులు కొనసాగుతున్నాయి.

ఈ కేంద్రాల్లో జరుగుతున్న కార్యకలాపాలపై అవగాహన ఉన్న అధికారుల వివరాల ప్రకారం.. ఇప్పటివరకు దాదాపు 80శాతం పనులు పూర్తయ్యాయి.

అయితే వ్యోమనౌక,రాకెట్‌కు తుది అనుమతులు ఇచ్చే ముందు మరికొన్ని కీలక పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

భారతదేశం మానవ సహిత అంతరిక్ష ప్రయాణ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు చేపడుతున్న తొలి ప్రయత్నం కావడంతో ఇస్రో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదు.

ప్రయోగంలో చిన్నపాటి సాంకేతిక లోపం కూడా తలెత్తకుండా అన్ని వ్యవస్థలను పటిష్ఠంగా సిద్ధం చేయాలని భావిస్తోంది.

మిగిలిన సాంకేతిక పరీక్షలు, అంచనాల కారణంగా డిసెంబర్‌లో ప్రయోగం నిర్వహించడం కష్టంగా మారవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

వివరాలు 

డిసెంబర్‌లోనే ప్రయోగమని గతంలో ప్రకటించిన ఇస్రో చైర్మన్

ఈ ఏడాది సెప్టెంబర్‌లో EOS-05 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన GSLV-F17 ప్రయోగం విజయవంతమైన అనంతరం ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ గగన్‌యాన్ మిషన్‌పై కీలక వివరాలు వెల్లడించారు.

2026 క్యాలెండర్ ఏడాదిలో NVS-03 ఉపగ్రహంతో పాటు తొలి మానవరహిత గగన్‌యాన్ ప్రయోగం సహా మరో ఆరు ప్రయోగాలను చేపట్టనున్నట్లు అప్పట్లో ప్రకటించారు.

గగన్‌యాన్ కోసం ఇప్పటివరకు సుమారు 8,000పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

సాధారణ ఉపగ్రహ ప్రయోగాలతో పోలిస్తే ఈ మిషన్‌లో మానవ ప్రాణాల భద్రత అత్యంత కీలకమని స్పష్టం చేశారు.

వ్యోమగాములకు ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చే క్రూ ఎస్కేప్ సిస్టమ్,అంతరిక్ష నౌకలో అవసరమైన వాతావరణ పరిస్థితులను నియంత్రించే ఎన్విరాన్‌మెంటల్ కంట్రోల్ వ్యవస్థలు తుది దశకు చేరుకున్నాయని వివరించారు.

ADVERTISEMENT

వివరాలు 

గగన్‌యాన్ ప్రయోగ గడువులో పలుమార్లు మార్పులు

మరోవైపు ఆర్బిటల్ మాడ్యూల్ అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

భారత్ తన తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రను 2022 మే నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో 2019 జనవరిలో గగన్‌యాన్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.

తొలుత రెండు మానవరహిత ప్రయోగాలు నిర్వహించిన తర్వాత వ్యోమగాములతో కూడిన ప్రయోగాన్ని చేపట్టాలని ప్రణాళిక రూపొందించారు.

అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ ప్రాజెక్టుకు అవసరమైన పరికరాల తయారీ, సరఫరా వ్యవస్థల్లో తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి.

దీంతో మొదట నిర్ణయించిన గడువును మార్చాల్సి వచ్చింది. ఆ తర్వాత 2024 అక్టోబర్‌లో గగన్‌యాన్ కార్యక్రమాన్ని మరింత విస్తరించారు.

తొలుత మూడు మిషన్లుగా ఉన్న ప్రణాళికను ఎనిమిది మిషన్లకు పెంచారు.

ADVERTISEMENT

వివరాలు 

తొలి మానవరహిత ప్రయోగం ఎందుకు కీలకం?

కొత్త ప్రణాళిక ప్రకారం.. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించే మానవ సహిత ప్రయోగానికి ముందు మూడు మానవరహిత ప్రయోగాలను నిర్వహించాల్సి ఉంటుంది.

ఈ పరీక్షల ద్వారా అంతరిక్ష నౌకలోని అన్ని వ్యవస్థల పనితీరును ముందుగానే నిర్ధారించనున్నారు.

గగన్‌యాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్న తొలి మానవరహిత ప్రయోగాన్ని G1గా పిలుస్తారు.

ఇందులో భాగంగా ఇస్రో అభివృద్ధి చేసిన అర్ధ-మానవ రోబోట్ 'వ్యోమమిత్ర'ను అంతరిక్షంలోకి పంపించనున్నారు.

భవిష్యత్తులో వ్యోమగాములు ప్రయాణించనున్న వ్యోమనౌకలోని కీలక వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో వ్యోమమిత్ర ద్వారా పరీక్షించనున్నారు.

మానవ ప్రయాణానికి అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన LVM3 రాకెట్, క్రూ మాడ్యూల్, లైఫ్ సపోర్ట్ టెక్నాలజీలు, వ్యోమగాములను తిరిగి సురక్షితంగా తీసుకొచ్చే రికవరీ వ్యవస్థల పనితీరును ఈ ప్రయోగం ద్వారా అంచనా వేయనున్నారు.

వివరాలు 

తొలి మానవరహిత ప్రయోగం ఎందుకు కీలకం?

ముఖ్యంగా అంతరిక్ష ప్రయాణ సమయంలో వ్యోమగాములకు అవసరమైన జీవనాధార సదుపాయాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో నిర్ధారించుకోవడం ఈ మిషన్‌లో కీలక అంశం.

భవిష్యత్తులో మనుషుల ప్రాణాలతో ముడిపడి ఉన్న ప్రాజెక్టు కావడంతో ప్రయోగ గడువుల కంటే సాంకేతిక విశ్వసనీయత, భద్రతకే ఇస్రో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది.

తాజా అంచనాలు నిజమైతే.. సొంతంగా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించే దిశగా భారత్ వేయనున్న తొలి అడుగు 2027 ఫిబ్రవరిలో కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.

ADVERTISEMENT