ఇకపై తెలుగులోనూ ఏఐ చాట్‌బోట్.. అందుబాటులోకి గూగుల్ బార్డ్ సేవలు
దిగ్గజ సెర్చ్ ఇంజిన్ గూగుల్ 'బార్డ్' గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు భారతీయ భాషల్లోనూ ఏఐ చాట్‌బోట్ సేవలు వినియోగించుకోవచ్చని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తెలుగులోనూ బార్డ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తెలుగు సహా హిందీ, తమిళం, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, గుజరాతీ, ఉర్దూ భాషల్లోనూ బార్డ్ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చామని గూగుల్ వెల్లడించింది. ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీ (OpenAI ChatGPT), మైక్రోసాఫ్ట్ బింగ్ చాట్ (Microsoft Bing Chat)లకు పోటీగా గూగుల్ 'బార్డ్' ప్రవేశించింది. ప్రస్తుతం కృత్రిమ మేధస్సు రంగంలో దూసుకెళ్తున్న వివిధ సంస్థల ఏఐ సేవలకు పోటీగా నిలదొక్కుకుంటున్న 'బార్డ్' ఏఐ చాట్‌బోట్ సేవలు ఇకపై తెలుగు భాషలోనూ వినియోగించుకోవచ్చని గూగుల్ పేర్కొంది.
గూగుల్ లెన్స్ ఫీచర్లను సైతం బార్డ్‌కు అనుసంధానం
మొత్తంగా 40 భాషల్లో బార్డ్ సేవలు లభిస్తాయని కంపెనీ స్పష్టం చేసింది. గూగుల్ లెన్స్ ఫీచర్లను సైతం బార్డ్‌కు అనుసంధానించనున్నామని వివరించింది. ఏదైనా ఫొటోకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు, ఫొటోకు క్యాప్షన్ పెట్టేందుకు ఈ ప్రత్యేక ఫీచర్ సహకరిస్తుందని చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఆంగ్లంలో మాత్రమే ఇది అందుబాటులో ఉందని గుర్తు చేసింది. కొద్ది కాలంలోనే మిగతా భాషల్లోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేసింది. గూగుల్ బార్డ్‌లో రీసెట్ చాట్, బార్డ్ యాక్టివిటీ లాంటి స్పెషల్ ఫీచర్లున్నాయి. అప్పటి వరకు చేసిన చాట్ ను రీసెట్ చాట్‌తో డిలీట్ చేసుకుని, కొత్త చాట్ పేజ్ ఓపెన్ చేసుకోవచ్చు. మరోవైపు అప్పటివరకు అడిగిన ప్రశ్నలను బార్డ్ యాక్టివిటీ ఆప్షన్ ద్వారా చూడొచ్చు.