Google Pay: గూగుల్ పేలోనూ బిల్లు చెల్లింపులపై ఫీజు!
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్‌కు చెందిన డిజిటల్ పేమెంట్ యాప్ గూగుల్ పే (Google Pay) ఇకపై విద్యుత్, గ్యాస్ తదితర బిల్లుల చెల్లింపులపై అదనపు రుసుము వసూలు చేయనుంది.
ఇప్పటివరకు ఈ తరహా లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు లేకుండా సేవలను అందించగా, ఇకపై క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై కన్వీనియన్స్ ఫీజును వసూలు చేయనుంది.
అయితే యూపీఐ (UPI) మార్గం ద్వారా చేసే లావాదేవీలకు ఈ ఛార్జీలు వర్తించవు.
పేటియం (Paytm), ఫోన్ పే (PhonePe) వంటి ఇతర పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లు ఇప్పటికే ఈ విధమైన రుసుములను వసూలు చేస్తుండగా, గూగుల్ పే కూడా అదే దారిలో ముందుకెళ్లనుంది.
వివరాలు
మొబైల్ రీఛార్జ్‌లకు ఇప్పటికే ఛార్జీలు
గత ఏడాది నుంచే గూగుల్ పే మొబైల్ రీఛార్జీలపై రూ.3 కన్వీనియన్స్ ఫీజును వసూలు చేస్తోంది.
ఇప్పుడు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా విద్యుత్, గ్యాస్ బిల్లుల చెల్లింపులపై 0.5% నుంచి 1% వరకు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఓ వినియోగదారు గూగుల్ పే ద్వారా క్రెడిట్ కార్డ్ ఉపయోగించి విద్యుత్ బిల్ చెల్లించినప్పుడు అతనికి రూ.15 కన్వీనియన్స్ ఫీజుగా వసూలు అయినట్లు ఓ ఆంగ్ల మీడియా సంస్థ వెల్లడించింది.
దీని ద్వారా గూగుల్ పే ఇప్పటికే ఈ కొత్త ఛార్జీలను అమలు చేయడం ప్రారంభించినట్లు అర్థమవుతోంది.
వివరాలు
ఈ ఛార్జీలు అందరికీ వర్తిస్తాయా?
ప్రస్తుతం ఈ రుసుములు అందరికీ వర్తిస్తాయా, లేక కొందరికి మాత్రమేనా అనే విషయంలో స్పష్టత లేదు.
అయితే భవిష్యత్తులో ఈ ఛార్జీలు అన్ని యూజర్లకూ వర్తించే అవకాశం ఉందని టెక్నాలజీ నిపుణులు భావిస్తున్నారు.
గూగుల్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, గూగుల్ పే వెబ్‌సైట్ ప్రకారం ఈ రుసుములు కార్డ్ పేమెంట్ ప్రాసెసింగ్ ఖర్చులను తగ్గించడంలో ఉపయోగపడతాయని పేర్కొంది.
ఇప్పటికే ఫిన్‌టెక్, క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్ ఫీజులను వసూలు చేయడం ప్రారంభించాయి.
ఈ ట్రెండ్‌ను ఇతర సంస్థలు కూడా అనుసరించే అవకాశం ఉందని, దీంతో వీటి ఆదాయ వనరులు మరింత పెరుగుతాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.