Google: విల్లో క్వాంటమ్ చిప్‌ను ఆవిష్కరించిన గూగుల్.. క్లిష్టతరమైన గణాంక సమస్యకు ఐదు నిమిషాల్లోనే పరిష్కారం
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తన క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో గొప్ప ప్రగతి సాధించింది. కొత్తగా ఒక క్వాంటమ్ చిప్‌ను ఆవిష్కరించింది.సాంప్రదాయ కంప్యూటర్లతో పోల్చితే మెరుపు వేగంతో పనిచేసే'విల్లో'క్వాంటమ్ చిప్‌ను రూపొందించింది. ఈ చిప్‌ను కాలిఫోర్నియాలోని శాంటా బార్బరాలోని గూగుల్ క్వాంటమ్ ల్యాబ్‌లో అభివృద్ధి చేశారు. ఈ విషయాన్ని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించింది. గూగుల్ ప్రకారం,ఈ విల్లో చిప్ 5నిమిషాల్లోనే అత్యంత క్లిష్టమైన గణాంక సమస్యలను పరిష్కరించగలదు. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్‌లు ఇదే పని చేయాలంటే 10సెప్టిలియన్ సంవత్సరాలు పడతాయంటే,విశ్వం ఆవిర్భావం కంటే ఎక్కువ సమయం పట్టాల్సి వస్తుందని గూగుల్ తెలిపింది. క్వాంటమ్ చిప్ అనేది ఒక ప్రత్యేకమైన కంప్యూటర్ చిప్,ఇది క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాలను ఉపయోగించి పనిచేస్తుంది.
పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులు
సాధారణ చిప్‌లతో పోల్చితే,ఇది కంప్యూటింగ్‌లో మరింత వేగంగా పనిచేస్తుంది. సాధారణ కంప్యూటర్లు బైనరీ భాషలో 0, 1 అనే సంకేతాలతో పని చేస్తాయి, కానీ క్వాంటమ్ కంప్యూటర్‌లు క్యూబిట్స్‌ను ఉపయోగిస్తాయి. క్యూబిట్ ఒకే సమయంలో 0, 1 స్థితులలో ఉండగలదు, దీనిని సూపర్ పొజిషన్ అంటారు. ఈ సూపర్ పొజిషన్ సాయంతో క్వాంటమ్ కంప్యూటర్లు అపారమైన సమాచారాన్ని వేగంగా ప్రాసెస్ చేస్తాయి, దీని వల్ల పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. గూగుల్ తన నూతన చిప్‌లో 105క్యూబిట్స్‌ను ఉపయోగించింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ విల్లో క్వాంటమ్ చిప్‌ను 'ఎక్స్' వేదికలో ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందిస్తూ, ఇది నిజంగా అద్భుతమైన ఆవిష్కరణగా కొనియాడారు.