Sunita Williams: భారతీయ-అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు నాసా ఎంత జీతం చెల్లిస్తుంది? ఇతర సౌకర్యాలు ఏంటి?
భారతీయ అమెరికన్ వ్యోమగామి, అమెరికా నేవీ మాజీ కెప్టెన్ సునీతా విలియమ్స్ ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్నారు. అంతరిక్షంలో ఆమె ఇప్పటికే 322 రోజులు గడిపిన అనుభవం ఉంది. ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీతా, వారం రోజుల్లో భూమికి తిరిగి రావాల్సి ఉండగా, సాంకేతిక సమస్యల కారణంగా ఇంకా అక్కడే కొనసాగుతున్నారు. నాసా ఈ పరిస్థితిని పరిష్కరించి, సునీతాను తిరిగి భూమిపైకి తీసుకురావడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్‌ను కూడా భూమిపైకి తీసుకురావాలని యోచిస్తున్నప్పటికీ, ఈ ప్రక్రియ ఏప్రిల్ వరకు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
1998లో నాసా వ్యోమగామిగా ఎంపిక
అంతరిక్ష పరిశోధనలో వ్యోమగాములు కీలక పాత్ర పోషిస్తారు. విశ్వం రహస్యాలను ఛేదించేందుకు, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి సంబంధించి అనేక మిషన్లలో వారు పాల్గొంటారు. సునీతా విలియమ్స్, 1998లో నాసా వ్యోమగామిగా ఎంపికై పలు మిషన్లలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే వ్యోమగాములకు నాసా ఎంత జీతం చెల్లిస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నాసాలో వ్యోమగాములకు గ్రేడ్ ఆధారంగా జీతభత్యాలు లభిస్తాయి. జీఎస్-13, జీఎస్-14, జీఎస్-15 వంటి గ్రేడ్ల ప్రకారం వార్షిక జీతాలు, అదనపు ప్రయోజనాలు ఉంటాయి.
జీఎస్-13:
జీఎస్-13 స్థాయిలో ఉన్న వ్యోమగాములకు గంటకు 50.50 అమెరికన్ డాలర్లు (రూ. 4,300), నెలకు సుమారు 8,898.25 డాలర్లు (రూ. 7.60 లక్షలు) వేతనం అందుతుంది. జీఎస్-14: జీఎస్-14 గ్రేడ్‌లో ఉన్నవారికి గంటకు 59.78 డాలర్లు (రూ. 5,100),నెలకు 10,397 డాలర్లు(రూ. 8.85 లక్షలు) వేతనం లభిస్తుంది. జీఎస్-15: జీఎస్-15 స్థాయిలో ఉన్నవారికి సంవత్సరానికి సుమారు 146,757 డాలర్లు(రూ. 1.25 కోట్లు)జీతం చెల్లిస్తారు. సునీతా విలియమ్స్‌కు నాసా ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్,అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్,మానసిక మద్దతు, ట్రావెల్ అలవెన్స్,మిషన్ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు కూడా లభిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఐఎస్ఎస్‌లో చిక్కుకుపోయి ఉన్నా,2025 మార్చి లేదా ఏప్రిల్ నాటికి స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా ఆమెను భూమిపైకి తీసుకురావడానికి నాసా ప్రణాళికలు వేస్తోంది.