IIT Madras: మిస్సైళ్ల దాడికీ ఈ గోడలు కూలవు.. బలమైన నిర్మాణ వ్యవస్థపై ఐఐటీ మద్రాస్ పరిశోధన
ఈ వార్తాకథనం ఏంటి
యుద్ధాల సమయంలో ఉగ్రవాద దాడులు భారీ స్థాయిలో జరుగుతాయి. అత్యధిక వేగంతో దూసుకువచ్చే మిస్సైళ్లు భవనాలను ఢీకొట్టి గోడలను ఛిద్రం చేస్తాయి.
ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, బాంబులు, మిస్సైళ్లు, శక్తివంతమైన పేలుళ్లను తట్టుకునే గోడల నిర్మాణంపై పరిశోధనలు జరుగుతున్నాయి.
ఈ అధునాతన నిర్మాణ సాంకేతికతను ఐఐటీ మద్రాస్ అభివృద్ధి చేస్తోంది.
సైనిక బంకర్లు, అణువిద్యుత్ కేంద్రాలు, వంతెనలు, ఇతర కీలక కట్టడాలకు ఈ కొత్త రక్షణాత్మక నిర్మాణాలను అనువర్తించేందుకు పరిశోధనలు సాగిస్తున్నది.
వివరాలు
పేలుళ్ల ప్రభావాన్ని తగ్గించే సాంకేతికత
పేలుళ్ల ప్రభావంతో ఎత్తైన భవనాలు క్షణాల్లో నేలమట్టమైపోతుంటాయి.ఈ పరిస్థితిని నివారించేందుకు,గోడల నిర్మాణంలో మార్పులు చేసేందుకు ఐఐటీ మద్రాస్ పరిశోధక బృందం కీలక ప్రతిపాదనలు తీసుకువచ్చింది.
గతంలో చోటుచేసుకున్న పేలుళ్లు, వాటి ప్రభావాలు, భవనాలపై వాటి తీరుతెన్నులు వంటి అంశాలను ఈ సంస్థ నిపుణులు లోతుగా విశ్లేషించారు.
సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ అళగప్పన్ పొన్నళగు మాట్లాడుతూ - "పేలుడు ప్రభావం గోడలపై ఎలా పడుతుందో పరిశోధించాం. గోడల ధృఢతను విశ్లేషించాం. ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రత్యేకంగా బాలిస్టిక్ రెసిస్టెన్స్ కలిగిన ఆర్‌సీ (రీ-ఇన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్) ప్యానెల్ డిజైన్‌ను అభివృద్ధి చేస్తున్నాం. బాంబులు, మిస్సైళ్లు పడినప్పుడు ఏర్పడే నాశనాన్ని అంచనా వేసి, వాటిని నిరోధించే మార్గాలను రూపొందిస్తున్నాం." అని వివరించారు.
వివరాలు
సరిహద్దుల్లోని సైనిక బంకర్లలో.. బాలిస్టిక్ రెసిస్టెన్స్ మాడ్యులర్ ప్యానెల్
దుర్భేద్యమైన గోడలను రూపొందించడం మాత్రమే కాకుండా, నిర్మాణ వ్యయాన్ని కూడా తగ్గించాలనే లక్ష్యంతో ఈ పరిశోధనను కొనసాగిస్తున్నట్లు అళగప్పన్ పేర్కొన్నారు.
బాలిస్టిక్ రెసిస్టెన్స్ మాడ్యులర్ ప్యానెల్లు భవిష్యత్తులో సరిహద్దుల్లోని సైనిక బంకర్లలో వినియోగించేందుకు అనుకూలంగా ఉండేలా మరిన్ని పరిశోధనలు జరుపుతున్నామని రిసెర్చ్ స్కాలర్ రవూఫ్ ఉన్ నబీదార్ వెల్లడించారు.