2040 నాటికి చంద్రుడిపైకి భారత వ్యోమగామి పంపాలి: ప్రధాని మోదీ నిర్దేశం
భారతదేశం చేపట్టబోయే గగన్‌యాన్ మిషన్ పురోగతిని అంచనా వేయడానికి, ఇస్రో భవిష్యత్ ప్రణాళికలను రూపొందించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం ఒక ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇటీవలి చంద్రయాన్-3, ఆదిత్య L1 మిషన్‌లతో సహా భారతీయ అంతరిక్ష కార్యక్రమాల సక్సెస్ అయిన నేపథ్యంలో, ఆ విజయాల పరంపరను కొనసాగించాలని మోదీ సమావేశంలో సూచించారు. 2035 నాటికి 'భారతీయ అంతరిక్ష కేంద్రం' ఏర్పాటు చేయాలని, 2040 నాటికి చంద్రుడిపైకి మొదటి భారతీయుడిని పంపడం వంటి కొత్త ప్రతిష్టాత్మక లక్ష్యాలను ఇప్పుడు నిర్దేశించుకోవాలని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో భారతదేశ సామర్థ్యాలపై ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. అంతరిక్ష పరిశోధనలో కొత్త పుంతలు తొక్కేందుకు దేశం తిరుగులేని నిబద్ధతను పునరుద్ఘాటించారు.
అక్టోబర్ 21న క్రూ ఎస్కేప్ సిస్టమ్ టెస్ట్
గగన్‌యాన్ ప్రయోగం కోసం ముందస్తుగా ఇస్రో 20 పరీక్షలను నిర్వహించనుంది. అక్టోబర్ 21న క్రూ ఎస్కేప్ సిస్టమ్ టెస్ట్ వెహికల్ మొదటి ప్రదర్శన ఉంటుందని మోదీకి ఇస్రో వివరించింది. 2025లో గగన్‌యాన్‌ను ప్రయోగించనున్నారు. అంతరిక్ష లక్ష్యాలను చేరుకోవడానికి, అంతరిక్ష శాఖ చంద్రునిపై అన్వేషణ కోసం వివరణాత్మక రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తుంది. ఈ ప్రణాళికలో చంద్రయాన్ మిషన్ల శ్రేణి, నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ (NGLV) అభివృద్ధి, కొత్త లాంచ్ ప్యాడ్ నిర్మాణం, మానవ-కేంద్రీకృత ప్రయోగశాలలు, సంబంధిత సాంకేతికతల స్థాపన ఉంటాయి. అంతరిక్ష కేంద్రం, వ్యోమగామి అంతరిక్ష యాత్ర ప్రణాళికలు విజయవంతమైతే గ్లోబల్ స్పేస్ కమ్యూనిటీలో భారత్ ప్రధాన ప్లేయర్‌గా అవతరిస్తుంది.