Cancer: 2045 నాటికి భారతదేశంలో క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతాయి: ICMR
క్యాన్సర్.. ప్రపంచంలో అధిక మరణాలకు కారణమవుతున్న రెండవ అతి పెద్ద ఆరోగ్య సమస్య.మొదటి స్థానంలో గుండె జబ్బులు ఉండగా, రెండవ స్థానంలో క్యాన్సర్ ఉంది. ఈ వ్యాధికి అనేక రకాలు ఉన్నాయి. మగవారికి వచ్చే క్యాన్సర్లు, మహిళలకు వచ్చే క్యాన్సర్లు వేరుగా ఉంటాయి. ప్రపంచంలో ప్రమాదకరంగా పరిగణించే 5 రకాల క్యాన్సర్లలో అధికంగా ప్రభావితమైన దేశాల జాబితాలో భారతదేశం మూడవ స్థానంలో ఉండటం ఆందోళన కలిగించే విషయం. భారతదేశపు అగ్ర పరిశోధనా సంస్థ ICMR-నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్ (NCDIR) వారు చేసిన కొన్ని అధ్యయనాల ద్వారా, క్యాన్సర్ గురించి కొన్ని ఆశ్చర్యకర నిజాలు వెలుగులోకి వచ్చాయి.
మహిళలకు రొమ్ము క్యాన్సర్
భారతదేశంలో క్యాన్సర్ రేట్లు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా పురుషులలో నోటి క్యాన్సర్ ప్రమాదకర స్థాయిలో ఉంది. ఎక్కువ మంది మగవారు పెదవులు, నోటి క్యాన్సర్ల బారిన పడుతుండగా,మహిళలు ప్రధానంగా రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, భారతదేశం,చైనా,దక్షిణాఫ్రికా వంటి దేశాలలో క్యాన్సర్ కేసులు, మరణాలు, జీవన నాణ్యత వంటి అంశాలపై విశ్లేషణలు చేశారు. ఈ కేసుల కారణంగా వచ్చే మరణాలను కూడా లెక్కించారు. రష్యాలో కొత్త క్యాన్సర్ కేసులు పురుషులలోనూ, మహిళలలోనూ అధికంగా నమోదు అవుతున్నాయని తేలింది. రష్యాలో పురుషులకు ప్రధానంగా ప్రోస్టేట్,ఊపిరితిత్తుల క్యాన్సర్లు,కొలొరెక్టల్ క్యాన్సర్లు ఎక్కువగా ఉంటాయి. అయితే భారతదేశంలో నోటి క్యాన్సర్ కేసులు అధికంగా ఉన్నాయి.బ్రిక్స్ దేశాలలో మహిళలు ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు.
భారతదేశంలో క్యాన్సర్ కేసులు 12.8%
అధ్యయనాల ప్రకారం, క్యాన్సర్ కారణంగా మరణాల రేటు దక్షిణాఫ్రికాలో ఎక్కువగా ఉంది,మహిళలు అత్యధికంగా ప్రాణాలు కోల్పోతున్నారు. భారతదేశం మినహాయిస్తే, బ్రిక్స్ దేశాలలో ఊపిరితిత్తుల క్యాన్సర్ అత్యధికంగా ఉంది. భారతదేశంలో మాత్రం రొమ్ము క్యాన్సర్ కారణంగా ఎక్కువ మరణాలు జరుగుతున్నాయి. అలాగే, శ్వాసనాళాల క్యాన్సర్లు కూడా పెరుగుతున్నాయి. విశ్లేషణల ప్రకారం, 2045 నాటికి దక్షిణాఫ్రికా, భారతదేశాలలో క్యాన్సర్ కేసుల కారణంగా మరణాలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. గత ఐదేళ్లలో భారతదేశంలో క్యాన్సర్ కేసులు 12.8% పెరిగాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.